జ్యోతి యర్రాజి
రాంచీ: జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి విజేతగా నిలిచింది. జ్యోతి అందరికంటే వేగంగా 12.89 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
నిత్య రామరాజ్ (తమిళనాడు; 13.44 సెకన్లు) రజతం... సప్న కుమారి (జార్ఖండ్; 13.58 సెకన్లు) కాంస్యం గెలిచారు. తెలంగాణ అథ్లెట్ అగసార నందిని 13.65 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ లావెటి యశ్వంత్ కుమార్ 14.62 సెకన్లలో గమ్యానికి చేరి చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
భారత ఆర్చరీ జట్లకు నిరాశ
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీలో కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. రెండు విభాగాల్లో భారత జట్లు క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయాయి.
మహిళల టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి, అవ్‌నీత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు 228–231 (57–58, 57–58, 57–59, 57–56)తో హజల్ బురున్, ఇపెక్ తొమ్రుక్, ఇర్మక్ యుక్సెల్‌లతో కూడిన తుర్కియే జట్టు చేతిలో ఓడిపోయింది.
ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలె, రిషభ్ యాదవ్, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల జట్టుకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించగా... రెండో రౌండ్‌లో 236–228తో ఇండోనేసియా జట్టును ఓడించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 231–234తో మెక్సికో జట్టు చేతిలో పరాజయం పాలైంది. పురుషుల రికర్వ్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర 656 పాయింట్లు స్కోరు చేసి 13వ ర్యాంక్‌లో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment