Photo Courtesy: IPL 2026
ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. 15 ఏళ్ల వయసులోనే బౌలర్లను ఉతికారేస్తుండడంతో అతడికి బౌలింగ్ చేయాలంటేనే భయపడుతున్నారు. హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, కమిన్స్, షమీ లాంటి టాప్ పేసర్లు కూడా అతడి పరుగుల వరదని ఆపలేకపోయారు. అయితే గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ కగిసో రబాడ మాత్రం వైభవ్ సూర్యవంశీని పెద్దగా పట్టించుకోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అతడికి బంతులు వేసే క్రమంలో 11 ఏళ్లుగా తనకు తెలిసిన విధానాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్లు కొట్టడంపై మ్యాచ్ అనంతరం రబాడ స్పందించాడు. ‘11 ఏళ్లుగా బౌలింగ్ చేస్తున్నా. అదే విధానమే ఇప్పటికీ కొనసాగుతుంది. బౌలర్లు తమ ప్రణాళికలపై నమ్మకం ఉంచాలి.
బ్యాటర్ల బలహీనతలపై విశ్లేషణ చేస్తాం. చాలా కష్టపడి సిద్ధమవుతాం. కానీ చివరికి అదే ప్రాసెస్‌ను కొనసాగించాలి’ అని పేర్కొన్నాడు. శరీరం బాగానే ఉంది. కానీ మానసిక అలసట కూడా ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్‌గా మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని తెలిపాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో తొలి అంచె పోటీల్లో వరుస విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రెండో అంచెలో మాత్రం ఓటములు చవిచూస్తూ వస్తోంది. అయితే వైభవ్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లో మినిమం గ్యారంటీ ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. అంతేకాదు ఈ సీజన్‌లో నాలుగోసారి సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన వైభవ్ పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 77 పరుగుల భారీ తేడాతో గెలిచింది. మ్యాచ్‌లో రబాడ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్ 2026 పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి.. 18 వికెట్లు తీసి అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. రాజస్తాన్‌పై విజయంతో గుజరాత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.


