
మాంచెస్టర్: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ స్టార్ వేన్ రూనీ అడుగుజాడల్లోనే తన కుమారుడు పయనిస్తున్నాడు. 11 ఏళ్ల కాయ్ రూనీ ప్రతిష్టాత్మక మాంచెస్టర్ యునైటెడ్ అకాడమీలో చేరేందుకు సంతకం చేశాడు. మాంచెస్టర్ యునైటెడ్ తరఫున 2003 నుంచి 2017 వరకు ఆడి రికార్డుస్థాయిలో 183 గోల్స్ చేసిన 35 ఏళ్ల రూనీ తన పుత్రోత్సాహాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘నేను గర్వపడే రోజు ఇది.
నా కుమారుడు కాయ్ మాంచెస్టర్‌తో జతకట్టాడు. కాయ్ నువు చాలా కష్టపడాలి. మరెంతో ఎదగాలి. ఆల్ ది బెస్ట్’ అని ఇంగ్లండ్ తరఫున 120 మ్యాచ్‌లు ఆడి 53 గోల్స్ చేసిన రూనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. రూనీ భార్య, కాయ్ తల్లి కొలీన్ కూడా తన సంతోషాన్ని వెలిబుచ్చింది. ‘ఇది మాకెంతో ప్రత్యేకం. అభినందనలు కాయ్. అత్యుత్తమంగా రాణించేందుకు కృషి చేయాలి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. రూనీ–కొలీన్ దంపతులకు నలుగురు కుమారులు కాగా... కాయ్ అందరికంటే పెద్దవాడు.