మెగా వేలంలో ఎవరూ పట్టించుకోలేదు.. అయినా ఐపీఎల్‌ను వదలని కేన్‌ మామ | Kane Williamson To Don A New Role In IPL 2025 After Going Unsold In Mega Auction | Sakshi
Sakshi News home page

మెగా వేలంలో ఎవరూ పట్టించుకోలేదు.. అయినా ఐపీఎల్‌ను వదలని కేన్‌ మామ

Published Fri, Mar 21 2025 6:07 PM | Last Updated on Fri, Mar 21 2025 6:33 PM

Kane Williamson To Don A New Role In IPL 2025 After Going Unsold In Mega Auction

ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను ఎవరూ పట్టించుకోని విషయం తెలిసిందే. 34 ఏళ్ల కేన్‌ మామ నిదానంగా ఆడతాడన్న కారణంగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు అతన్ని చిన్న చూపు చూశాయి. ఆటగాడిగా ఎంపిక కాకపోయినా ఏ మాత్రం నిరాశ చెందని విలియమ్సన్‌.. ఐపీఎల్‌లో కొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు.

రేపటి నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్‌ 18వ ఎడిషన్‌లో కేన్‌ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నాడు. స్టార్లతో నిండిన కామెంటేటర్ల ప్యానెల్‌ను ఐపీఎల్‌ ఇవాళ (మార్చి 21) విడుదల చేసింది. ఇందులో కేన్‌తో పాటు హర్ష భోగ్లే, రవిశాస్త్రి, సునీల్‌ గవాస్కర్‌, ఇయాన్‌ బిషప్‌, నవజ్యోత్ సింగ్ సిద్ధూ లాంటి ప్రముఖ వ్యాఖ్యాతల పేర్లు ఉన్నాయి. ఈ ఐపీఎల్‌ సీజన్‌తో కామెంటేటర్‌గా అరంగేట్రం చేస్తున్న కేన్‌ మామ నేషనల్‌ ఫీడ్‌ను అందిస్తాడు.

ఐపీఎల్‌ విడుదల చేసిన వ్యాఖ్యాతల జాబితాలో రెండు విభాగాలు ఉన్నాయి. ఒ‍కటి నేషనల్‌ ఫీడ్‌ కాగా.. రెండోది వరల్డ్‌ ఫీడ్‌. నేషనల్‌ ఫీడ్‌లో దేశీయ వ్యాఖ్యాతలతో పాటు విదేశీ వ్యాఖ్యాతలు ఉండగా.. వరల్డ్‌ ఫీడ్‌లో ఎక్కువ శాతం విదేశీ వ్యాఖ్యాతలే ఉన్నారు.

ఐపీఎల్‌ జాతీయ ఫీడ్ వ్యాఖ్యాతల జాబితా..
సునీల్ గవాస్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్, మైకేల్ క్లార్క్, మాథ్యూ హేడెన్, మార్క్ బౌచర్, ఆర్పీ సింగ్, షేన్ వాట్సన్, సంజయ్ బంగర్, వరుణ్ ఆరోన్, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్‌, శిఖర్‌ ధావన్, అనిల్‌ కుంబ్లే, సురేశ్‌ రైనా, కేన్‌ విలియమ్సన్, ఏబీ డివిలియర్స్, ఆరోన్ ఫించ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, మహ్మద్ కైఫ్, పీయూష్ చావ్లా.

ఐపీఎల్‌ ప్రపంచ ఫీడ్ వ్యాఖ్యాతల జాబితా..
ఇయాన్ మోర్గాన్, గ్రేమ్ స్వాన్, హర్ష భోగ్లే, సైమన్ డౌల్, ఎంపుమలెలో ఎంబాంగ్వా, నిక్ నైట్, డానీ మారిసన్, ఇయాన్ బిషప్, అలన్ విల్కిన్స్, డారెన్ గంగా, కేటీ మార్టిన్, నటాలీ జర్మానోస్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, మాథ్యూ హేడెన్, దీప్దాస్‌ గుప్తా, షేన్‌ వాట్సన్‌, మైకేల్‌ క్లార్క్‌, ఆరోన్ ఫించ్, వరుణ్ ఆరోన్, అంజుమ్ చోప్రా, డబ్ల్యూవీ రామన్, మురళీ కార్తీక్.

కాగా, 79 మ్యాచ్‌ల ఐపీఎల్‌ అనుభవం ఉండటంతో అంతర్జాతీయ స్థాయిలో అన్ని ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న కేన్‌ విలియమ్సన్‌ను గతేడాది జరిగిన ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ పట్టించుకోకపోవడం బాధాకరం. కేన్‌ మామను గత సీజన్‌లో ఆడిన గుజరాత్‌ టైటాన్స్‌ సహా అతని మాజీ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా లైట్‌గా తీసుకుంది. 

అంతర్జాతీయ వేదికపై కేన్‌ తన సొంత జట్టు న్యూజిలాండ్‌కు ఆడుతుండటంతో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌కు.. ద హండ్రెడ్‌ లీగ్‌లో లండన్‌ స్పిరిట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2025 సీజన్‌ రేపటి నుంచి ప్రారంభం​ కానుంది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ కేకేఆర్‌ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కేకేఆర్‌ సొంత మైదానమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement