రేపు అర్జెంటీనా మ్యాచ్‌.. కేర‌ళ‌లో మెస్సీ మేనియా! | Kerala Fans-Tribute-Lionel Messi-Ahead-Argentina Match FIFA WC | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: రేపు అర్జెంటీనా మ్యాచ్‌.. కేర‌ళ‌లో మెస్సీ మేనియా!

Jun 16 2026 1:34 PM | Updated on Jun 16 2026 2:55 PM

Kerala Fans-Tribute-Lionel Messi-Ahead-Argentina Match FIFA WC

ఫిఫా ప్రపంచకప్-2026లో బుధ‌వారం డిఫెండింగ్ చాంపియ‌న్ అర్జెంటీనా త‌మ తొలి మ్యాచ్‌ను ఆడ‌నుంది. గ్రూప్‌-ఐలో ఉన్న అర్జెంటీనా త‌మ తొలి మ్యాచ్‌లో అల్జీరియాతో  త‌ల‌ప‌డ‌నుంది. భార‌త కాల‌మాన ప్ర‌కారం ఈ మ్యాచ్ రేపు ఉద‌యం 6.30 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మెస్సీ ఆఖ‌రి ఫిఫా అని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో అత‌డి ఆట కోసం ప్ర‌పంచం మొత్తం వెయ్యిక‌ళ్ల‌తో ఎదురుచూస్తోంది. 

భార‌త్‌లో కూడా మెస్సీకి వీరాభిమానులు ఉన్నారు. కేర‌ళ‌లో మెస్సీ అంటే ప‌డిచ‌చ్చిపోయేవాళ్లు లెక్కలేనంత మంది ఉంటారు. అస‌లే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌, ఆపై డిఫెండింగ్ చాంపియ‌న్స్ హోదాలో అర్జెంటీనా బ‌రిలోకి దిగుతుండ‌డంతో కేర‌ళ‌లో ఫిఫా క‌ళ వ‌చ్చేసింది. ముఖ్యంగా కేర‌ళ‌లోని పుల్ల‌వూర్ గ్రామంలో మెస్సీ మేనియా మాములుగా లేదు. 

ఆ ఊర్లో ఎక్క‌డ చూసినా ఫుట్‌బాల్ ఆట‌గాళ్ల క‌టౌట్లే క‌నిపిస్తాయి. ఇక్క‌డ మెస్సీ అభిమానులే కాదు రొనాల్డో, నెయ్‌మ‌ర్‌, ఎంబాపె, సాలా, లామినే య‌మాల్ వంటి ఆట‌గాళ్ల‌కు కూడా విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ఉంది. అక్క‌డి ఇళ్ల‌కు కూడా ప్ర‌జ‌లు త‌మ‌కిష్ట‌మైన జ‌ట్ల రంగుల‌ను పెయింటింగ్ వేసుకోవ‌డం విశేషం. 

ఇక రేపు అర్జెంటీనా మ్యాచ్ ఉండ‌డంతో ఆ జ‌ట్టు అభిమానులు పుల్ల‌వూరు గ్రామంలో ఉన్న న‌ది మ‌ధ్య‌లో ప్లోటింగ్ బోర్డుపై అర్జెంటీనా జ‌ట్టు మొత్తాన్ని క‌టౌట్ల రూపంలో ఉంచ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తం మీద ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మేనియా ఇప్పుడు భార‌త్‌లో కూడా టాప్ గేర్‌కు చేరుకున్న‌ట్ల‌యింది. 2022లో ఖ‌తార్ వేదిక‌గా జ‌రిగిన ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో అర్జెంటీనా ఫైన‌ల్లో ఫ్రాన్స్‌ను షూటౌట్‌లో ఓడించి మూడోసారి ఫిఫా టైటిల్‌ను కైవ‌సం చేసుకుంది.

అసలు సమరం మొదలు..
మరో విషయమేంటంటే.. బుధవారం ఒక్కరోజే ముగ్గురు బిగ్‌స్టార్స్‌ మ్యాచ్‌లు ఆడనుండడంతో ఫిఫాలో అసలు సమరం మొదలుకానుంది. బుధవారం తెల్లవారుజామున ఫ్రాన్స్‌, సెనెగల్ మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత ఉదయం 6.30 గంటలకు మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా అల్జీరియాతో తలపడనుంది. ఇక అదే రోజు రాత్రి 10.30 గంటలకు పోర్చుగల్ కాంగో రిపబ్లిక్‌తో తలపడనుంది. ఇలా త్రిమూర్తులు ఒకేరోజు మ్యాచ్ ఆడనుండడంతో అభిమానుల్లో ఎనలేని జోష్ వచ్చింది.

చదవండి: కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభ‌వ్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement