![Kevin Pietersen picks his top four for Champions Trophy 2025](/styles/webp/s3/article_images/2025/02/14/Kevin-Pietersen.jpg.webp?itok=utXc4T1V)
ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. ఫిబ్రవరి 19 నుంచి కరాచీ (పాకిస్తాన్) వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గోనే అన్ని జట్లు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఎలాగైనా ఛాంపియన్స్‌గా నిలవాలని ఆయా జట్లు పట్టుదలతో ఉన్నాయి.
ఈ మినీ వరల్డ్‌కప్ కోసం టీమ్స్ ఒక్కొక్కటిగా పాకిస్తాన్‌కు చేరుకుంటున్నాయి. పాకిస్తాన్ 1996 వన్డే ప్రపంచకప్ తర్వాత ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుండడం ఇదే మొదటి సారి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టీమిండియా తమ మొత్తం మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడనుంది.
కాగా ఈ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో ఏయే టీమ్స్ సెమీస్ చేరుతాయి, విజేత ఎవరన్నది? మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేరాడు. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుతాయని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.
అదేలా సాధ్యం కెవిన్?
అయితే ఇక్కడే పీటర్సన్ పప్పులో కాలేశాడు. ఎందుకంటే కెవిన్ ఎంచుకున్న జట్లలో మూడు టీమ్స్ ఒకే గ్రూపులో ఉన్నవి కావడం గమనార్హం. ఈ మినీ వరల్డ్‌కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గోంటున్నాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. అందులో గ్రూప్-ఎలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, ఇంగ్లండ్‌లు ఉన్నాయి.
ప్రతి గ్రూప్ నుండి పాయింట్ల పట్టికలో తొలి రెండు రెండు స్ధానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. కానీ ఈ ఇంగ్లండ్ దిగ్గజం మాత్రం గ్రూపు-ఎ నుంచే మూడు జట్లు సెమీస్‌కు చేరుకుంటాయని అంచనావేశాడు.
మ్యాథమెటికల్‌గా ఒకే గ్రూపు నుంచి మూడు జట్లు సెమీస్‌కు చేరడం సాధ్యం కాదు. దీంతో నెటిజన్లు పీటర్సన్‌ను ట్రోలు చేస్తున్నారు. కాగా ఈ మెగా టోర్నీకి టీమిండియా స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానాన్ని హర్షిత్ రాణాతో బీసీసీఐ భర్తీ చేసింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
చదవండి:Champions Trophy 2025: ఫేక్ అక్రెడిటేషన్‌తో కరాచీ స్టేడియానికి.. భద్రతపై సందేహాలు
Comments
Please login to add a commentAdd a comment