
పచ్చని కొండ కోనల్లో.. అమాయకంగా జీవించే ఆదివాసీల బిడ్డ ఘనత సాధించింది. కట్టెలమ్ముకునే ఇంట పుట్టిన ఆమె.. జాతీయ వేదికపై పసిడి పతకంతో మెరిసింది. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఖేలో ఇండియా యూత్‌గేమ్స్‌లో పాల్గొని.. బంగారు పతకాన్ని సాధించింది. తనతోటి ఆదివాసీ బిడ్డలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి.. అల్లూరి జిల్లా మన్యాన్ని మురిపించింది. ఆమే కుంజా రజిత.
– కూనవరం(రంపచోడవరం)
కారడవిలో కుగ్రామం
కూనవరం మండలం పోచవరం పంచాయతీ పరిధిలోని దట్టమైన అడవిలో ఉన్న కుగ్రామం రామచంద్రాపురం. రజిత స్వగ్రామం. 35 ఏళ్ల కిందట పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్ నుంచి రజిత తండ్రి మారయ్య కుటుంబం ఇక్కడకు వలస వచ్చింది. రెక్కాడితేగాని డొక్కాడని దయనీయ స్థితి మారయ్య కుటుంబానిది. కుంజా మారయ్య, భద్రమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. చివరి సంతానమే కుంజా రజిత. భర్త చనిపోయాక కుటుంబ భారం భద్రమ్మ పైనే పడింది. అడవికెళ్లి కట్టెలు మోపు తెచ్చుకొని అమ్ముకోవడం ద్వారా కుటుంబాన్ని పోషించుకునేది. రజిత ప్రతి రోజూ 12 కిలోమీటర్లు దూరం కాలిబాటన చింతూరు మండలం కాటుకపల్లి వెళ్లి లీడ్స్ పాఠశాలలో చదువుకోవడం.. తిరిగి 12 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకునేది. అలా ఒకటి నుంచి 8 వరకు అక్కడే చదివింది. సెలవుల్లో తల్లి వెంట కట్టెలకు వెళ్లి చేదోడుగా ఉండేది. చిన్నప్పటి నుంచి పరుగు పందాలంటే రజితకు భలే ఇష్టం. పరుగులో రజితలోని వేగాన్ని ఆమె పెద్దన్న జోగయ్య గమనించాడు. స్థానిక పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాడు.
పతకాల పంట
2019 అసోంలో నిర్వహించిన జాతీయ ఖేలిండియా అథ్లెటిక్స్ పోటీల్లో 400 మీటర్ల పరుగు విభాగంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచి వెండి పతకం సాధించింది. ఇటీవల గుజరాత్‌లో జరిగిన జాతీయ ఖేలో ఇండియా అథ్లెటిక్ పోటీలో కాంస్యం గెలుపొందింది. జాతీయ ఓపెన్ 400 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసింది. హర్యానాలో మంగళవారం జరిగిన జాతీయ ఖేలో ఇండియా అథ్లెటిక్ పోటీల్లో అండర్–20 విభాగంలో 400 మీటర్ల పరుగు పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచింది. రజిత 56.07 సెకన్లలో గమ్యాన్ని చేరి బంగారు పతకం దక్కించుకుంది.
ఆగని పరుగు
కాటుకపల్లి పాఠశాలలో 8వ తరగతి వరకే ఉండేది. అనంతరం నెల్లూరు ఆశ్రమ పాఠశాలలో సీటు రావడంతో రజిత 9, 10 అక్కడే పూర్తి చేసింది. ఆ సమయంలో పరుగులో శిక్షణకు బీజపడింది. నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో వంశీసాయి కిరణ్ ఆధ్వర్యంలో ఆమె శిక్షణ పొందింది. మంగళగిరిలో ఇంటర్మీయట్ చదువుతూ గుంటూరు శాప్ ద్వారా గురువులు కృష్ణ మోహన్, మైకే రసూల్ వద్ద అథ్లెటిక్స్ శిక్షణ తీసుకుంది. ఓ పక్క చదువు, సాధన చేస్తూనే పోటీల్లో పాల్గొనేది. అక్కడే తన ఆటలోని బలాలు, బలహీనతలు తెలుసుకుని మరింత రాటుదేలింది. అంతర్జాతీయ స్థాయికి చేరాలంటే అత్యుత్తమ శిక్షణ అవసరమని భావించి.. ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగుబండి రమేష్‌ను సంప్రదించింది. ఆయన శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఆమె పరిస్థితిని గమనించిన ఆయన పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలోని మైత్రీ ఫౌండేషన్‌కు దృష్టికి తీసుకెళ్లారు. వారు ఫిజియోథెరపీ, అవసరమైన దుస్తులు, బూట్లు వంటివన్నీ అందిస్తున్నారు. ఆమె ఆటతీరు, కుటుంబ పరిస్థితి గమనించిన లెక్కల మాస్టార్ నాగేంద్ర ప్రతి నెలా కొంత మొత్తం అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment