బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ సీజన్ ముగింపు బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు భారత స్టార్ షట్లర్లు, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ అర్హత సాధించారు. బ్యాంకాక్ వేదికగా ఈనెల 27 నుంచి 31 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. కరోనా కారణంగా గతేడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితం థాయ్‌లాండ్ ఓపెన్ రెండు సూపర్–1000 టోర్నీలతో అంతర్జాతీయ సీజన్ పునః ప్రారంభమైంది. ఈ రెండు టోర్నీల్లో భాగంగా రెండోది ఆదివారం ముగిసింది. అనంతరం వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారుల వివరాలను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. భారత్ తరఫున మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్
కిడాంబి శ్రీకాంత్ అర్హత పొందారు.
థాయ్‌లాండ్ ఓపెన్ రెండు టోర్నీల్లో బరిలోకి దిగిన ఆటగాళ్లనే వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పరిగణిస్తామని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. ఈ టోర్నీలకు బయలుదేరేముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో జపాన్, చైనా ఆటగాళ్లకు పాజిటివ్ రావడంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లు థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి వైదొలిగారు. దాంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లు వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆడే అవకాశం కోల్పోయారు.
వరల్డ్ టూర్ ఫైనల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉన్నవారే ఈ టోర్నీలో ఆడతారు. అయితే ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో సింధు 11వ ర్యాంక్‌లో నిలిచింది. టాప్–8లో ముగ్గురు థాయ్‌లాండ్ క్రీడాకారిణులు ఉండటం, జపాన్ ప్లేయర్ నొజోమి ఒకుహారా కూడా గైర్హాజరు కావడం పీవీ సింధుకు కలిసొచ్చింది. దాంతో ఎనిమిదో ర్యాంకర్‌గా సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్ బెర్త్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఏడో ర్యాంకర్‌గా అర్హత పొందాడు. వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత పొందిన ఆటగాళ్లందరికీ సోమవారం మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్ట్ నెగెటివ్ వస్తేనే టోర్నీలో ఆడే అవకాశం కల్పిస్తారు. మంగళవారం ‘డ్రా’ వివరాలు వెల్లడిస్తారు.
అర్హత పొందిన క్రీడాకారులు...
మహిళల సింగిల్స్: కరోలినా మారిన్ (స్పెయిన్), తై జు యింగ్ (చైనీస్ తైపీ), రచనోక్, పోర్న్‌పవీ (థాయ్‌లాండ్), యాన్ సె యంగ్ (దక్షిణ కొరియా), మిచెల్లి లీ (కెనడా), ఎవగెనియా కొసెత్‌స్కాయ (రష్యా), సింధు (భారత్).
పురుషుల సింగిల్స్: అక్సెల్‌సన్, ఆంటోన్సెన్ (డెన్మార్క్), చౌ తియెన్ చెన్, వాంగ్ జు వె (చైనీస్ తైపీ), ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్), శ్రీకాంత్ (భారత్), లీ జి జియా (మలేసియా), ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)
వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు శ్రీకాంత్, సింధు అర్హత
Published Mon, Jan 25 2021 4:31 AM | Last Updated on Mon, Jan 25 2021 4:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment