Kidambi Srikant
-
కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మల గ్రాండ్ రిసెప్షన్.. హాజరైన చిరంజీవి, నాగార్జున(ఫొటోలు)
-
భారత జట్ల శుభారంభం
చెంగ్డు (చైనా): ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లు థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. థామస్ కప్‌లో భాగంగా గ్రూప్ ‘సి’లో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల టీమ్ 4–1 తేడాతో థాయిలాండ్‌పై విజయం సాధించింది. మహిళల టోర్నీ ఉబెర్ కప్ గ్రూప్ ‘ఎ’లో భారత్ 4–1 స్కోరుతోనే కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్‌లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్‌పై కున్లావట్ వితిద్సన్ గెలుపొందాడు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. తీరారట్‌సకుల్ పై లక్ష్యసేన్, సరన్జమ్శ్రీపై కిడాంబి శ్రీకాంత్ విజయం సాధించారు. తొలి డబుల్స్‌లో సుక్ఫున్ – తీరారట్‌సకుల్ జంటపై సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టి జోడి... పన్‌పనిచ్ – సొథోన్పై ఎంఆర్ అర్జున్ – ధ్రువ్ కపిల గెలిచారు. ఉబెర్ కప్‌లో తొలి సింగిల్స్‌లో మిచెల్ లిపై అస్మిత చాలిహ, కేథరీన్ – జెస్లీన్పై ప్రియ – శృతి, వెన్ జాంగ్‌పై ఇషారాణి బారువా గెలుపొందారు. అయితే రెండో డబుల్స్‌లో జాకీ డెంట్ – క్రిస్టల్ లాయ్ చేతిలో సిమ్రన్ సింఘీ – రితిక ఠాకర్ ఓడిపోగా... చివరి మ్యాచ్‌లో ఎలియానా జాంగ్‌పై అన్మోల్ ఖర్బ్ విజయం సాధించింది. -
తెలుగు తేజానికి ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
దేశ బ్యాడ్మింటన్ చరిత్ర తిరగ రాస్తూ భారత జట్టు థామస్ కప్‌ని గెలుచుకుంది. క్రీడా ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు భారత జట్టును ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అయితే గెలిచిన జట్టులో ఓ సభ్యుడైన తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చేసిన ఓ వ్యాఖ్య ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకట్టుకుంది. కిదాంబి శ్రీకాంత్ చెప్పిన విషయం ఆటలకే కాదు వ్యాపార రంగానికి ఆ మాటకు వస్తే నిత్య జీవితంలో కూడా పాటించాల్సిన ఎంతో ముఖ్యమైన విషయం అంటూ కొనియాడారు. థామస్ గెలుపును ఆస్వాదిస్తూ కిదాంబి శ్రీకాంత్ ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఈ టోర్నమెంట్లో మేమంతా ఒక టీంగా ఎంతో బాగా ఆడామని, ఆ అనుభవం విభిన్నమైనదని తెలిపారు. కప్ గెలుచుకోవడం అనేది పైపూత మాత్రమేనని. నిజానికి ఓ టీమ్‌గా కచ్చితంగా ఆడటమే అసలైన విజయమంటూ తెలిపారు. అనేక మంది వ్యక్తులతో ముడిపడి ఉండే బిజినెస్‌లో టీంస్పిరిట్ అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ఇదే విషయాన్ని ఆనంద్ మహీంద్రా ఎన్నోసార్లు చెప్పారు కూడా. లాభాలు అనేవి బోనస్ మాత్రమేనని అసలైన విజయం లక్ష్యాన్ని చేరుకోవడంలో ఓక టీంగా మనం ఎలా పని చేశానమనేది ముఖ్యమని గతంలో మహీంద్రా చెప్పారు. అదే రకమైన అభిప్రాయాన్ని కిదాంబి శ్రీకాంత్ సైతం వ్యక్తం చేశాడు. And here’s a good addition to #mondaythoughts He says the Thomas Cup title was simply ‘Icing on the cake.’ It was the Team Experience that was the real prize! Brilliant. Let’s remember that; in Business and in all of Life.. pic.twitter.com/wN3FtLiVhz — anand mahindra (@anandmahindra) May 16, 2022 చదవండి: మహీంద్రా రైజ్.. ఆటోమొబైల్ సెక్టార్లో తొలిసారిగా.. -
German Open: సింధుకు ఊహించని షాక్.. సైనా కూడా అవుట్!
మ్యుహెమ్ అండరుహ్ (జర్మనీ): భారత స్టార్ షట్లర్లకు జర్మన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ కంగుతినగా, పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ ప్రపంచ నంబర్‌వన్, ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–16, 21–23, 21–18తో చైనాకు చెందిన లుగ్వాంగ్ జుపై గెలిచాడు. గంటా 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో చైనా ప్రత్యర్థి గట్టి పోటీ ఇచ్చాడు. హోరాహోరీగా జరిగిన రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు చివరకు నిరాశే ఎదురైంది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో జాగ్రత్తగా ఆడు తూ పైచేయి సాధించాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 21–19, 24–22తో లీ చిక్ యూ (హాంకాంగ్)పై గెలిచాడు. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌కు సిసలైన సవాలు ఎదురు కానుంది. ఒలింపిక్ చాంపియన్, టాప్‌సీడ్ విక్టర్ అక్సెసెన్ (డెన్మార్క్)తో భారత స్టార్ తలపడనున్నాడు. సింధు, సైనా అవుట్! మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సింధు 14–21, 21–15, 14–21తో జాంగ్ యిమన్ (చైనా) చేతిలో కంగుతింది. వచ్చే వారం ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కోసం కఠోరంగా శ్రమిస్తోన్న సింధుకు ఇది ఊహించని షాక్. అన్‌సీడెడ్ ప్రత్యర్థిపై ఒక గేమ్ గెలిచినా, మిగతా రెండు గేముల్లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సుదీర్ఘకాలంగా ఫిట్నెస్ సమస్యలెదుర్కొంటూ కెరీర్ కొనసాగిస్తున్న సైనా తన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. థాయ్‌లాండ్ స్టార్, ఎనిమిదో సీడ్ రత్చనోక్ ఇంతనొన్ 21–10, 21–15తో సైనాపై అవలీలగా గెలిచింది. 31 నిమిషాల్లోనే సైనాతో మ్యాచ్‌ను ముగించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జోడీ 23–21, 16–21, 21–14తో భారత్‌కే చెందిన ఇషాన్ భట్నాగర్–సాయిప్రతీక్ జంటపై గెలిచింది. చదవండి: Novak Djokovic: నంబర్ 1 ర్యాంకు కోల్పోయావు.. అయినా నువ్వు మారవా! -
వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు శ్రీకాంత్, సింధు అర్హత
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ సీజన్ ముగింపు బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు భారత స్టార్ షట్లర్లు, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ అర్హత సాధించారు. బ్యాంకాక్ వేదికగా ఈనెల 27 నుంచి 31 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. కరోనా కారణంగా గతేడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితం థాయ్‌లాండ్ ఓపెన్ రెండు సూపర్–1000 టోర్నీలతో అంతర్జాతీయ సీజన్ పునః ప్రారంభమైంది. ఈ రెండు టోర్నీల్లో భాగంగా రెండోది ఆదివారం ముగిసింది. అనంతరం వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారుల వివరాలను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. భారత్ తరఫున మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ అర్హత పొందారు. థాయ్‌లాండ్ ఓపెన్ రెండు టోర్నీల్లో బరిలోకి దిగిన ఆటగాళ్లనే వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పరిగణిస్తామని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. ఈ టోర్నీలకు బయలుదేరేముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో జపాన్, చైనా ఆటగాళ్లకు పాజిటివ్ రావడంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లు థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి వైదొలిగారు. దాంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లు వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆడే అవకాశం కోల్పోయారు. వరల్డ్ టూర్ ఫైనల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉన్నవారే ఈ టోర్నీలో ఆడతారు. అయితే ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో సింధు 11వ ర్యాంక్‌లో నిలిచింది. టాప్–8లో ముగ్గురు థాయ్‌లాండ్ క్రీడాకారిణులు ఉండటం, జపాన్ ప్లేయర్ నొజోమి ఒకుహారా కూడా గైర్హాజరు కావడం పీవీ సింధుకు కలిసొచ్చింది. దాంతో ఎనిమిదో ర్యాంకర్‌గా సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్ బెర్త్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఏడో ర్యాంకర్‌గా అర్హత పొందాడు. వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత పొందిన ఆటగాళ్లందరికీ సోమవారం మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్ట్ నెగెటివ్ వస్తేనే టోర్నీలో ఆడే అవకాశం కల్పిస్తారు. మంగళవారం ‘డ్రా’ వివరాలు వెల్లడిస్తారు. అర్హత పొందిన క్రీడాకారులు... మహిళల సింగిల్స్: కరోలినా మారిన్ (స్పెయిన్), తై జు యింగ్ (చైనీస్ తైపీ), రచనోక్, పోర్న్‌పవీ (థాయ్‌లాండ్), యాన్ సె యంగ్ (దక్షిణ కొరియా), మిచెల్లి లీ (కెనడా), ఎవగెనియా కొసెత్‌స్కాయ (రష్యా), సింధు (భారత్). పురుషుల సింగిల్స్: అక్సెల్సన్, ఆంటోన్సెన్ (డెన్మార్క్), చౌ తియెన్ చెన్, వాంగ్ జు వె (చైనీస్ తైపీ), ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్), శ్రీకాంత్ (భారత్), లీ జి జియా (మలేసియా), ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) -
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్. ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి, ప్రణవ్ చోప్రా–శివమ్ శర్మ జోడీలు, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప, అపర్ణా బాలన్–శ్రుతి జంటలు కూడా క్వార్టర్స్ చేరాయి. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భమిడిపాటి సాయిప్రణీత్ 18–21, 21–16, 21–15తో భారత్‌కే చెందిన ఐదో సీడ్ సమీర్‌వర్మకు షాకిచ్చాడు. మూడో సీడ్ శ్రీకాంత్ 21–11, 21–16తో లూ గ్వాంగ్జు (చైనా)పై గెలుపొందగా, హెచ్.ఎస్.ప్రణయ్ 21–19, 20–22, 21–17తో జాన్ జార్జెన్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. పారుపల్లి కశ్యప్ 21–11, 21–13తో తనోంగ్సక్ సెన్సోబూన్సుక్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్, రెండో సీడ్ సింధు 21–11, 21–13తో డెంగ్ జాయ్ జువన్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో ఆరో సీడ్ మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయం 25–23, 21–18తో హువంగ్ కిజియంగ్–వాంగ్ జెకంగ్ (చైనా) జంటపై, ప్రణవ్–శివమ్ జోడీ 21–15, 21–11తో భారత్‌కే చెందిన అనిరుధ మయేకర్–వినయ్ జంటపై గెలుపొందాయి. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి –అశ్విని పొన్నప్ప జంట 21–18, 21–14తో చెన్‌జియాఫో–జౌ చొమిన్ (చైనా) జోడీపై, అపర్ణ–శ్రుతి జంట 21–19, 7–21, 21–17తో వింగ్ యంగ్–యియంగ్ టింగ్ (హాంకాంగ్) జోడీపై గెలిచాయి. నేటి పురుషుల క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌తో సాయిప్రణీత్ ఢీకొంటాడు. -
నిరీక్షణ ముగిసేనా?
బర్మింగ్హమ్: బ్యాడ్మింటన్లోని అతి పురాతన టోర్నమెంట్లలో ఒకటైన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ పోటీలకు నేడు తెరలేవనుంది. 2001లో పుల్లెల గోపీచంద్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్లో భారత క్రీడాకారులకు టైటిల్ లభించలేదు. 2015లో సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరినప్పటికీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గతేడాది పీవీ సింధు పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. అయితే కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో భారత క్రీడాకారుల ప్రదర్శనను లెక్కలోకి తీసుకుంటే... ఈసారి కూడా మనోళ్లు టైటిల్ రేసులో ఉన్నారు. ముఖ్యంగా మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్లపై భారీ అంచనాలు ఉన్నాయి. మాజీ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) గాయంతో ఈ టోర్నీకి దూరం కావడం... ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) ఫామ్‌లో లేకపోవడం.. జపాన్ క్రీడాకారిణులు నొజోమి ఒకుహారా, అకానె యామగుచిలపై మంచి రికార్డు ఉండటంతో... సింధు, సైనాలు తమ స్థాయికి తగ్గట్టు ఆడితే వారికి ఈసారి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుధవారం జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో పదో ర్యాంకర్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)తో ఐదో ర్యాంకర్ పీవీ సింధు... కిర్స్టీ గిల్మోర్ (స్కాట్లాండ్)తో సైనా నెహ్వాల్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో సింధు 8–6తో సుంగ్ జీ హున్‌పై... సైనా 6–0తో గిల్మోర్‌పై ఆధిక్యంలో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి అత్యధికంగా నలుగురు బరిలో ఉన్నారు. మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి రౌండ్లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో శ్రీకాంత్; ప్రణయ్‌తో సాయిప్రణీత్; అక్సెల్సన్ (డెన్మార్క్)తో సమీర్ వర్మ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ఒయు జువాని–రెన్ జియాంగ్యు (చైనా) జోడీతో సుమీత్ రెడ్డి–మను అత్రి జంట... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో షిమో తనాకా–కొహారు యోనెమోటో (జపాన్) ద్వయంతో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ తలపడతాయి. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో చాంగ్ తక్ చింగ్–ఎన్జీ వింగ్ యుంగ్ (హాంకాంగ్)లతో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ఆడతారు. -
‘బిగ్ లీగ్’లో చేరానేమో!
♦ కలలా కెరీర్ సాగుతోంది ,సిడ్నీ నుంచి ‘సాక్షి’తో శ్రీకాంత్ సాక్షి, హైదరాబాద్: వారం వ్యవధిలో రెండు సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో విజేతగా నిలవడంతో తనకు తాను కొత్తగా పరిచయం చేసుకున్నట్లు అనిపిస్తోందని స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. సత్తా ఉంటే అగ్రశ్రేణి ఆటగాళ్లపై వరుస విజయాలు సాధించడం అసాధ్యం కాదని తాజా టోర్నీతో అతను నిరూపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయాన్ని ఆస్వాదిస్తున్న శ్రీకాంత్ సిడ్నీ నుంచి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు. విశేషాలు అతని మాటల్లోనే... ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయానుభూతి... మాటల్లో చెప్పలేను. ఒక పెద్ద కల నిజమైనట్లుగా ఉంది. వారం వ్యవధిలో రెండు సూపర్ సిరీస్‌లు గెలుచుకోవడం అనేది అనూహ్యం. నాకు తెలిసి వరల్డ్ టాప్ షట్లర్లలో కూడా చాలా మందికి ఇది సాధ్యం కాలేదు. అంతకు ముందు ఫైనల్లో ఓడిన టోర్నీతో కలుపుకుంటే ఇటీవలి రోజులు నా కెరీర్లో ఎంతో గొప్పగా సాగాయి. నా పట్టుదల, శ్రమకు లభించిన ఫలితమిది. టాప్ ఆటగాళ్ళపై విజయాలు సాధించడం... వరల్డ్ నంబర్‌వన్ సన్ వాన్ హోను రెండు సార్లు ఓడించడం అనేదే ప్రత్యేకం అనుకుంటే ఇప్పుడు చెన్ లాంగ్‌ను కూడా వరుస గేమ్‌లలో ఓడించగలిగాను. మనలో సత్తా, పోరాటతత్వం ఉంటే కోర్టులో ఎదురుగా ఉన్నది పెద్ద ఆటగాళ్లు అనే ఆలోచన రాదు. బరిలోకి దిగేటప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటం కూడా ముఖ్యం. నాతో పాటు ఇటీవల ప్రణయ్, సాయిప్రణీత్ సాధించిన విజయాలు కూడా ఏదీ అసాధ్యం కాదని నిరూపించాయి. చెన్ లాంగ్‌తో ఫైనల్ గెలుపుపై... మ్యాచ్‌లో నా తరఫు నుంచి ఎలాంటి పొరపాట్లు చేయరాదని గట్టిగా నిర్ణయించుకున్నాను. కెరీర్ ఆరంభం నుంచి కూడా స్మాషింగ్ నా బలం. ఈసారి దానికి తోడు ర్యాలీలు కూడా పోటాపోటీగా ఎదుర్కొన్నాను. నెట్ వద్ద డ్రాప్ షాట్లు కూడా సమర్థంగా ఆడాను. నాలో పెరిగిన ఆత్మవిశ్వాసం అదనపు బలాన్నిచ్చింది. సరిగ్గా చెప్పాలంటే ప్రతీది నాకు అనుకూలించింది. ఒక్కో ఆటగాడి కోసం మా జట్టు ఒక్కో వ్యూహంతో సిద్ధమవుతుంది. దాని ప్రకారం అంతా పని చేసింది. ఇటీవల ఆటలో వచ్చిన మార్పు... రియో ఒలింపిక్స్ తర్వాత చాలా వరకు టోర్నీలకు దూరమయ్యాను. చీలమండ గాయం నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అందుకే ఈ ఏడాది ఆరంభంలో పూర్తిగా రీహ్యాబిలిటేషన్పైనే దృష్టి పెట్టాను. టోర్నీలు ఆడలేకపోతున్నానని, ర్యాంక్ పడిపోతోందని బెంగ పెట్టుకొని బరిలోకి దిగే ధైర్యం చేసి ఉంటే గాయం తీవ్రమై మరింత ప్రమాదకరంగా మారేది. అందుకే దానిని పట్టించుకోకుండా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాను. మూడు నెలల క్రితం వచ్చిన ఇండోనేసియా కోచ్ ముల్యో హండోయో నా ఆటను మార్చడంలో కీలక పాత్ర పోషించారు. సాధారణమైన నా దూకుడుకు తోడు మరింత సాధికారికంగా, తప్పుల్లేకుండా ఆడేలా నా గేమ్‌ను మెరుగుపర్చారు. ఈ విజయాలకు అదే కారణం. బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం శ్రీకాంత్ స్థానం... నా కెరీర్లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచాను. బ్యాడ్మింటన్ దిగ్గజాలు లిన్ డాన్, లీ చోంగ్ వీలతో పోలిస్తే ఇది తక్కువే. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తెలుసు. అయితే ప్రస్తుతం ఆటలో చురుగ్గా ఉన్న షట్లర్లు, నా ప్రదర్శనను బట్టి చూస్తే నేను పెద్ద ఆటగాళ్ల సరసన చేరాననే నమ్ముతున్నాను. శ్రీకాంత్ అంటే ఏదో ఒకసారి అలా సంచలన విజయం సాధించేవాడిగా కాకుండా... బరిలో ఉంటే టైటిల్ చాలెంజర్‌గా, ప్రతీ ప్రత్యర్థి ప్రమాదకరంగా భావించే విధంగా గుర్తింపు ఉండాలి. ఆ జాబితాలో ఉండటానికి ఇదే అర్హతగా భావిస్తాను. నా తర్వాతి లక్ష్యం ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్. దాదాపు ఆరు వారాల పాటు పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టి సిద్ధమవుతా.