‘బిగ్ లీగ్’లో చేరానేమో!
♦ కలలా కెరీర్ సాగుతోంది ,సిడ్నీ నుంచి ‘సాక్షి’తో శ్రీకాంత్
సాక్షి, హైదరాబాద్: వారం వ్యవధిలో రెండు సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లలో విజేతగా నిలవడంతో తనకు తాను కొత్తగా పరిచయం చేసుకున్నట్లు అనిపిస్తోందని స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. సత్తా ఉంటే అగ్రశ్రేణి ఆటగాళ్లపై వరుస విజయాలు సాధించడం అసాధ్యం కాదని తాజా టోర్నీతో అతను నిరూపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయాన్ని ఆస్వాదిస్తున్న శ్రీకాంత్ సిడ్నీ నుంచి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు. విశేషాలు అతని మాటల్లోనే...
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయానుభూతి...
మాటల్లో చెప్పలేను. ఒక పెద్ద కల నిజమైనట్లుగా ఉంది. వారం వ్యవధిలో రెండు సూపర్ సిరీస్‌లు గెలుచుకోవడం అనేది అనూహ్యం. నాకు తెలిసి వరల్డ్ టాప్ షట్లర్లలో కూడా చాలా మందికి ఇది సాధ్యం కాలేదు. అంతకు ముందు ఫైనల్లో ఓడిన టోర్నీతో కలుపుకుంటే ఇటీవలి రోజులు నా కెరీర్‌లో ఎంతో గొప్పగా సాగాయి. నా పట్టుదల, శ్రమకు లభించిన ఫలితమిది.
టాప్ ఆటగాళ్ళపై విజయాలు సాధించడం...
వరల్డ్ నంబర్‌వన్ సన్ వాన్ హోను రెండు సార్లు ఓడించడం అనేదే ప్రత్యేకం అనుకుంటే ఇప్పుడు చెన్ లాంగ్‌ను కూడా వరుస గేమ్‌లలో ఓడించగలిగాను. మనలో సత్తా, పోరాటతత్వం ఉంటే కోర్టులో ఎదురుగా ఉన్నది పెద్ద ఆటగాళ్లు అనే ఆలోచన రాదు. బరిలోకి దిగేటప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటం కూడా ముఖ్యం. నాతో పాటు ఇటీవల ప్రణయ్, సాయిప్రణీత్ సాధించిన విజయాలు కూడా ఏదీ అసాధ్యం కాదని నిరూపించాయి.
చెన్ లాంగ్‌తో ఫైనల్ గెలుపుపై...
మ్యాచ్‌లో నా తరఫు నుంచి ఎలాంటి పొరపాట్లు చేయరాదని గట్టిగా నిర్ణయించుకున్నాను. కెరీర్ ఆరంభం నుంచి కూడా స్మాషింగ్ నా బలం. ఈసారి దానికి తోడు ర్యాలీలు కూడా పోటాపోటీగా ఎదుర్కొన్నాను. నెట్ వద్ద డ్రాప్ షాట్‌లు కూడా సమర్థంగా ఆడాను. నాలో పెరిగిన ఆత్మవిశ్వాసం అదనపు బలాన్నిచ్చింది. సరిగ్గా చెప్పాలంటే ప్రతీది నాకు అనుకూలించింది. ఒక్కో ఆటగాడి కోసం మా జట్టు ఒక్కో వ్యూహంతో సిద్ధమవుతుంది. దాని ప్రకారం అంతా పని చేసింది.
ఇటీవల ఆటలో వచ్చిన మార్పు...
రియో ఒలింపిక్స్ తర్వాత చాలా వరకు టోర్నీలకు దూరమయ్యాను. చీలమండ గాయం నన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అందుకే ఈ ఏడాది ఆరంభంలో పూర్తిగా రీహ్యాబిలిటేషన్‌పైనే దృష్టి పెట్టాను. టోర్నీలు ఆడలేకపోతున్నానని, ర్యాంక్ పడిపోతోందని బెంగ పెట్టుకొని బరిలోకి దిగే ధైర్యం చేసి ఉంటే గాయం తీవ్రమై మరింత ప్రమాదకరంగా మారేది. అందుకే దానిని పట్టించుకోకుండా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాను. మూడు నెలల క్రితం వచ్చిన ఇండోనేసియా కోచ్ ముల్యో హండోయో నా ఆటను మార్చడంలో కీలక పాత్ర పోషించారు. సాధారణమైన నా దూకుడుకు తోడు మరింత సాధికారికంగా, తప్పుల్లేకుండా ఆడేలా నా గేమ్‌ను మెరుగుపర్చారు. ఈ విజయాలకు అదే కారణం.
బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం శ్రీకాంత్ స్థానం...
నా కెరీర్‌లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచాను. బ్యాడ్మింటన్ దిగ్గజాలు లిన్ డాన్, లీ చోంగ్ వీలతో పోలిస్తే ఇది తక్కువే. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తెలుసు. అయితే ప్రస్తుతం ఆటలో చురుగ్గా ఉన్న షట్లర్లు, నా ప్రదర్శనను బట్టి చూస్తే నేను పెద్ద ఆటగాళ్ల సరసన చేరాననే నమ్ముతున్నాను. శ్రీకాంత్ అంటే ఏదో ఒకసారి అలా సంచలన విజయం సాధించేవాడిగా కాకుండా... బరిలో ఉంటే టైటిల్ చాలెంజర్‌గా, ప్రతీ ప్రత్యర్థి ప్రమాదకరంగా భావించే విధంగా గుర్తింపు ఉండాలి. ఆ జాబితాలో ఉండటానికి ఇదే అర్హతగా భావిస్తాను. నా తర్వాతి లక్ష్యం ఆగస్టులో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్. దాదాపు ఆరు వారాల పాటు పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టి సిద్ధమవుతా.