పాక్‌తో వన్డే సిరీస్‌.. సౌతాఫ్రికా విధ్వంసకర వీరుల రీఎంట్రీ | Klaasen Miller Returns 1 Uncapped player in South Africa Squad Vs PAK 2024 ODIs | Sakshi
Sakshi News home page

పాక్‌తో వన్డే సిరీస్‌.. విధ్వంసకర వీరుల రీఎంట్రీ.. అన్‌క్యాప్డ్‌ బౌలర్‌కు చోటు

Published Thu, Dec 12 2024 5:11 PM | Last Updated on Thu, Dec 12 2024 5:30 PM

Klaasen Miller Returns 1 Uncapped player in South Africa Squad Vs PAK 2024 ODIs

పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు క్రికెట్‌ సౌతాఫ్రికా తమ జట్టును ప్రకటించింది. తెంబా బవుమా సారథ్యంలోని ఈ జట్టులో క్వెనా మఫాకాకు తొలిసారి చోటు ఇచ్చినట్లు తెలిపింది. ఇక ఈ సిరీస్‌తో కగిసో రబడ, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కేశవ్‌ మహరాజ్‌ పునరాగమనం చేయనుండగా.. టీ20 వీరులు డేవిడ్‌ మిల్లర్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ సైతం తిరిగి వన్డే జట్టులో స్థానం సంపాదించారు.

డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్‌ 
కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు పాకిస్తాన్‌ సౌతాఫ్రికా పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య డిసెంబరు 10న తొలి టీ20 జరుగగా.. ఆతిథ్య జట్టు 11 పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. ఇక డిసెంబరు 13న రెండో, డిసెంబరు 14న మూడో టీ20 జరుగునుండగా.. డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్‌ మొదలుకానుంది.

‘అన్‌క్యాప్డ్‌’ ప్లేయర్‌కు చోటు
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా గురువారం తమ వన్డే జట్టును ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌తో పద్దెమినిదేళ్ల లెఫ్టార్మ్‌ పేసర్‌ క్వెనా మఫాకా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇటీవల వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన క్వెనా మఫాకా.. పాక్‌తో తొలి టీ20లో అదరగొట్టాడు. 

తన అద్భుత బౌలింగ్‌తో బాబర్‌ ఆజంను అవుట్‌ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తిచేసి 39 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.

గాయాల బెడద
మరోవైపు.. స్టార్‌ పేసర్‌ అన్రిచ్‌ నోర్జే కాలి గాయం కారణంగా.. మిగిలిన రెండు టీ20లు, వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక వేలు విరిగిన కారణంగా వియాన్‌ ముల్దర్‌, తుంటినొప్పి వల్ల లుంగి ఎంగిడి, గజ్జల్లో గాయం కారణంగా గెరాల్డ్‌ కోయెట్జి, వెన్నునొప్పితో బాధపడుతున్న నండ్రీ బర్గర్‌ సెలక్షన్‌కు అందుబాటులో లేకుండా పోయారు.

వారికి పునఃస్వాగతం
ఇదిలా ఉంటే.. పాక్‌తో టీ20 సిరీస్‌లో విశ్రాంతి తీసుకున్న రబడ, స్టబ్స్‌, కేశవ్‌ మహరాజ్‌ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ మాట్లాడుతూ.. తాము తమ వన్డే జట్టు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తెలిపాడు. క్వెనా మఫాకాకు కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుందని.. క్లాసెన్‌, మిల్లర్లకు వన్డే జట్టులోకి తిరిగి స్వాగతం పలుకుతున్నట్లు పేర్కొన్నాడు.

పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు
తెంబా బవుమా (కెప్టెన్), ఒట్ట్నీల్ బార్ట్మన్, టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), కేశవ్ మహరాజ్, క్వెనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్‌ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్.

సౌతాఫ్రికా వర్సెస్‌ పాకిస్తాన్‌ వన్డే సిరీస్‌ షెడ్యూల్‌
తొలి వన్డే- డిసెంబరు 17- పర్ల్‌- బోలాండ్‌ పార్క్‌
రెండో వన్డే- డిసెంబరు 19- సెంచూరియన్‌- సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌
మూడో వన్డే- డిసెంబరు 22- జొహన్నస్‌బర్గ్‌- ది వాండరర్స్‌ స్టేడియం.

చదవండి: భారత్‌తో మూడో టెస్టు... ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌పై వేటు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement