ఏడుగురు క్రీజులోకి దిగినా.. | Kolkata Knight Riders beats Chennai Super Kings by 10 runs | Sakshi
Sakshi News home page

చెన్నైకి చేతకాలేదు

Published Thu, Oct 8 2020 4:51 AM | Last Updated on Thu, Oct 8 2020 3:21 PM

Kolkata Knight Riders beats Chennai Super Kings by 10 runs - Sakshi

ముందు చెన్నై, తర్వాత కోల్‌కతా... ఇరు జట్లను బౌలర్లే మలుపు తిప్పారు. కోల్‌కతా భారీస్కోరు చేయకుండా సూపర్‌కింగ్స్‌ బౌలర్లు అడ్డుకట్ట వేస్తే... లక్ష్యాన్ని ఛేదించకుండా నైట్‌రైడర్స్‌ బౌలర్లు ఆపేశారు. టి20లంటే బ్యాట్స్‌మెన్‌ మెరుపులే కాదు... బౌలర్ల మలుపులు కూడా ఉంటాయని, సిక్సర్లే కాదు... అనూహ్య వికెట్లతో కూడా విజయం చేతులు మారుతుందని ఈ మ్యాచ్‌లో బౌలర్లు నిరూపించారు.   

అబుదాబి: గత మ్యాచ్‌లో కొండంత లక్ష్యాన్ని చెన్నై ఓపెనర్లిద్దరే పిండి... పిండి చేశారు. కానీ ఈ మ్యాచ్‌లో మోస్తరు లక్ష్యాన్ని ఏడుగురు క్రీజులోకి దిగినా ఛేదించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లకు తలవంచారు. దీంతో బుధవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాహుల్‌ త్రిపాఠి (51 బంతుల్లో 81; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. డ్వేన్‌ బ్రేవోకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. వాట్సన్‌ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. చెన్నై జట్టులో పీయూష్‌ చావ్లా స్థానంలో కరణ్‌ శర్మను తీసుకోగా... కోల్‌కతా మార్పుల్లేకుండా బరిలోకి దిగింది.

అందరు బ్యాట్లెత్తారు...
రాహుల్‌ త్రిపాఠితో ఆట ప్రారంభించిన శుబ్‌మన్‌ గిల్‌ (11), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ నితీశ్‌ రాణా (9), మోర్గాన్‌ (7), రసెల్‌ (2), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (12) ఇలా స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ చెన్నై బౌలింగ్‌కు బెంబేలెత్తారు. ఒక్కడు మినహా ఇంకెవరూ పట్టుమని 12 బంతులను మించి ఆడలేకపోయారు. మరోవైపు చెన్నై బౌలర్లలో ఒకే ఒక్క బౌలర్‌ (దీపక్‌ చహర్‌) తప్ప బౌలింగ్‌కు దిగిన ప్రతీ ఒక్కరు ప్రత్యర్థిపై ప్రతాపం చూపినవారే! స్యామ్‌ కరన్, శార్దుల్‌ ఠాకూర్, కరణ్‌ శర్మ తలా 2 వికెట్లు తీసి కోల్‌కతాను కట్టడి చేశారు. బ్రేవో అయితే టెయిలెండర్లు కమలేశ్‌(0), శివమ్‌ మావి (0)లను ఖాతానే తెరువనీయలేదు. ఆఖరి ఓవర్లో వాళ్లిద్దరిని ఔట్‌ చేశాడు. వరుణ్‌ చక్రవర్తి రనౌట్‌ కావడంతో బ్రేవో ఇన్నింగ్స్‌ 20వ ఓవర్లో 3 పరుగులే ఇచ్చాడు.

రాణించిన వాట్సన్‌...
ఆరంభంలో వాట్సన్, డుప్లెసిస్‌ చకాచకా బౌండరీలు బాదేశారు. కానీ ఈ బాదుడుకు అంతలోనే చుక్కెదురైంది. డుప్లెసిస్‌ (10 బంతుల్లో 17; 3 ఫోర్లు) వేగానికి శివమ్‌ మావి కళ్లెం వేశాడు. తర్వాత రాయుడు జతకాగా... ఇద్దరు కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు శ్రమించారు. ఫోర్‌... లేదంటే ఒకట్రెండు పరుగులతో చెన్నైని నడిపించారు. రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించాక రాయుడు (27 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో ధోని కాస్త ముందుగా బ్యాటింగ్‌కు దిగాడు. లక్ష్యందిశగా సాగుతున్నట్లు కనిపించిన సూపర్‌కింగ్స్‌ను నరైన్‌ ఓవర్‌ కలవరపెట్టింది. మరో ఓవర్‌ ధారాళంగా పరుగులిచ్చింది. అతని వరుస ఓవర్లు మ్యాచ్‌ అంచనాలను మార్చేశాయి. చాలా ఆలస్యంగా (ఇన్నింగ్స్‌ 12వ) బౌలింగ్‌కు దిగిన నరైన్‌ మొదటి ఓవర్లో 5 పరుగులిచ్చాడు. వాట్సన్‌ 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత కాసేపటికే అతన్ని నరైన్‌ ఎల్బీడబ్ల్యూ చేయడంతో కోల్‌కతా ఉత్సాహం రెట్టింపైంది. కానీ నరైన్‌ తర్వాతి ఓవర్‌ను స్యామ్‌ కరన్‌ తేలిగ్గా ఆడేశాడు. 6, 4తో కలిపి మొత్తం 14 పరుగులు రావడంతో చెన్నై శిబిరాన్ని ఆశల్లో నిలిపింది.

ధోని ఔట్‌ కాగానే...
యువ ఆటగాడు స్యామ్‌ కరన్‌ జోరు మీదున్నా... ధోని క్రీజులో ఉన్నా విజయ సమీకరణం అంత సులువుగా ఏమీ లేదు. ఆఖరి 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని (11) భారీషాట్లపై దృష్టిపెట్టాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన చెన్నై సారథి మరో షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. స్యామ్‌ (17)ను రసెల్‌ ఔట్‌ చేయడంతో చెన్నై లక్ష్యానికి దూరమైంది. చివరి 12 బంతుల్లో 36 పరుగులు చేయాలి. జడేజా (8 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కేదార్‌ జాదవ్‌ (7 నాటౌట్‌) క్రీజులో ఉండగా... 19వ ఓవర్‌ వేసిన నరైన్‌ 10 పరుగులిచ్చాడు. ఇక మిగతా 6 బంతుల్లో 26 పరుగులు ఆ ఇద్దరి వల్లా కాలేదు. రసెల్‌ చివరి ఓవర్లో జడేజా వరుసగా 6, 4, 4 కొట్టగా 15 పరుగులొచ్చాయి.

అతనొక్కడే 81
ఓపెనర్‌ త్రిపాఠి అత్యంత విలువైన ఇన్నింగ్స్‌తో కోల్‌కతాను ఆదుకున్నాడు. చెన్నై బౌలర్లతో ఆడుకున్నాడు. అన్నీతానై ఇన్నింగ్స్‌ను నడిపించాడు. నైట్‌రైడర్స్‌ స్కోరు 167. ప్రతీ ఒక్కరు బ్యాటింగ్‌ చేశారు. ఎక్స్‌ట్రాలు 10 పరుగులు తీసేస్తే సగం కంటే ఎక్కువ స్కోరు రాహుల్‌ త్రిపాఠిదే! రెండో ఉత్తమం 17 పరుగులు. నరైన్, కమిన్స్‌ ఆ స్కోరు చేశారు. 81 పరుగులు చేసిన ఓపెనర్‌ జోరుకు మిగతా బ్యాట్స్‌మెన్‌ బేజారుకు అసలు ఏమాత్రం పొంతనే లేదు. బౌండరీతో ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టిన త్రిపాఠి... దీపక్‌ చహర్‌ బౌలింగ్‌లో బౌండరీలతో దూకుడు పెంచాడు. చూడచక్కని సిక్సర్లతో అలరించాడు. దీంతో కోల్‌కతా స్కోరు సగటున 9 పరుగుల రన్‌రేట్‌తో సాగిపోయింది. గిల్, రాణా, నరైన్‌లు ఔటైనా ఈ రన్‌రేట్‌ మాత్రం తగ్గలేదంటే దానికి కారణం త్రిపాఠినే. 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న ఈ ఓపెనర్‌ క్రీజులో పాతుకుపోయాడు. ఆఖరిదాకా ఉంటే సెంచరీ చేసే ఊపుమీదున్న త్రిపాఠిని ఎట్టకేలకు బ్రేవో ఔట్‌ చేశాడు. అతను ఔటయ్యాక 3.1 ఓవర్లు ఆడిన కోల్‌కతా కేవలం 27 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది.

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ త్రిపాఠి (సి) వాట్సన్‌ (బి) బ్రేవో 81; గిల్‌ (సి) ధోని (బి) శార్దుల్‌ 11; నితీశ్‌ రాణా (సి) జడేజా (బి) కరణ్‌ శర్మ 9; నరైన్‌ (సి) డుప్లెసిస్‌ (బి) కరణ్‌ శర్మ 17; మోర్గాన్‌ (సి) డుప్లెసిస్‌ (బి) స్యామ్‌ కరన్‌ 7; రసెల్‌ (సి) ధోని (బి) శార్దుల్‌ 2; కార్తీక్‌ (సి) శార్దుల్‌ (బి) స్యామ్‌ కరన్‌ 12; కమిన్స్‌ (నాటౌట్‌) 17; కమలేశ్‌ (సి) డుప్లెసిస్‌ (బి) బ్రేవో 0; శివమ్‌ మావి (సి) ధోని (బి) బ్రేవో 0; వరుణ్‌ (రనౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్‌) 167.

వికెట్ల పతనం: 1–37, 2–70, 3–98, 4–114, 5–128, 6–140, 7–162, 8–163, 9–166, 10–167.     

బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–47–0, స్యామ్‌ కరన్‌ 4–0–26–2, శార్దుల్‌ 4–0–28–2, కరణ్‌ శర్మ 4–0–25–2, బ్రేవో 4–0–37–3.  

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) నరైన్‌ 50; డుప్లెసిస్‌ (సి) కార్తీక్‌ (బి) శివమ్‌ మావి 17; రాయుడు (సి) గిల్‌ (బి) కమలేశ్‌ 30; ధోని (బి) వరుణ్‌ 11; స్యామ్‌ కరన్‌ (సి) మోర్గాన్‌ (బి) రసెల్‌ 17; కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 7; రవీంద్ర జడేజా (నాటౌట్‌) 21; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 157.

వికెట్ల పతనం: 1–30, 2–99, 3–101, 4–129, 5–129. బౌలింగ్‌: కమిన్స్‌ 4–0–25–0, శివమ్‌ మావి 3–0–32–1, వరుణ్‌ చక్రవర్తి 4–0–28–1, కమలేశ్‌ 3–0–21–1, నరైన్‌ 4–0–31–1, రసెల్‌ 2–0–18–1.

► ఐపీఎల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోవడం 2015 తర్వాత ఇదే తొలిసారి.

► కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై లక్ష్యఛేదనలో ఓడిపోవడం చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకిదే మొదటిసారి. కోల్‌కతాపై ఛేజింగ్‌ చేస్తూ చెన్నై గతంలో ఎనిమిదిసార్లూ గెలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement