కోల్‌కతా పేస్‌కు రాయల్స్‌ కుదేల్‌  | Kolkata Knight Riders Won Against Rajasthan Royals IPL 2020 | Sakshi
Sakshi News home page

కోల్‌కతా పేస్‌కు రాయల్స్‌ కుదేల్‌ 

Published Thu, Oct 1 2020 8:03 AM | Last Updated on Thu, Oct 1 2020 8:03 AM

Kolkata Knight Riders Won Against Rajasthan Royals IPL 2020 - Sakshi

ఈ మ్యాచ్‌ చూస్తుంటే ఆడేది రాజస్తాన్‌ రాయల్సేనా అన్న అనుమానం కలుగక మానదు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ 216 (చెన్నైపై), 226 (పంజాబ్‌పై) పరుగుల్ని అవలీలగా చేసిన జట్టు ఇదేనా అని సగటు అభిమానికి తప్పక అనిపించే ఉంటుంది. ఆ రెండు మ్యాచ్‌ల్లో సిక్సర్లకు, ఈ మ్యాచ్‌లో అగచాట్లకు అసలేమాత్రం పొంతనేలేదు. అంతర్జాతీయ మేటి బౌలర్లను ఎదుర్కొన్న రాయల్స్‌ బ్యాటింగ్‌ దేశవాళీ బౌలర్ల ముందు కుదేలై ఈ లీగ్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది.  

దుబాయ్‌ : కోల్‌కతా కుర్రాళ్ల పేస్‌కు రాజస్తాన్‌ రాయల్స్‌ తలవంచింది. ఓ మోస్తరు స్కోరు ఛేదించలేక చతికిలబడింది. యువ పేసర్లు శివమ్‌ మావి (2/20), కమలేశ్‌ నాగర్‌కోటి (2/13) రాయల్స్‌ను శాసించారు. తొలి పది ఓవర్లలోనే వీరిద్దరి ఎదురుదెబ్బలకు రాజస్తాన్‌ ఎంతకీ కోలుకోలేకపోయింది. బుధవారం నైట్‌రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 37 పరుగుల తేడాతో  తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (34 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్‌), మోర్గాన్‌ (23 బంతుల్లో 34 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. జోఫ్రా ఆర్చర్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేసి ఓడింది. టామ్‌ కరన్‌ (36 బంతుల్లో 54 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు. శివమ్‌ మావికి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

నెమ్మదిగా జోరు పెంచి... 
నరైన్‌తో కలిసి ఆట ప్రారంభించిన శుబ్‌మన్‌ గిల్‌ రెండో ఓవర్లో భారీ సిక్సర్‌తో జోరు పెంచేందుకు ప్రయత్నించాడు. మరోవైపు నరైన్‌ తడబడగా బంతులు చాలా వరకు వృథాకాగా... వాటిని గిల్‌ తన బౌండరీలతో కవర్‌ చేశాడు. ఎట్టకేలకు ఉనాద్కట్‌ ఐదో ఓవర్లో బ్యాట్‌ ఝులిపించిన నరైన్‌ 6, 4 కొట్టాడు. కానీ మరుసటి బంతికే క్లీన్‌బౌల్డయ్యాడు. గిల్‌  బౌండరీలతో కాస్త స్పీడ్‌ పెంచగా జట్టు రన్‌రేట్‌ 8 పరుగులకు పెరిగింది. సిక్స్, 2 ఫోర్లతో కాసేపు క్రీజ్‌లో నిలిచిన నితీశ్‌ రాణా (17 బంతుల్లో 22)ను తేవటియా పెవిలియన్‌ చేర్చాడు. అర్ధసెంచరీకి చేరువవుతున్న శుబ్‌మన్‌ను ఆర్చర్‌ బోల్తా కొట్టించాడు. లెగ్‌ స్టంప్‌ దిశగా వేసిన గుడ్‌ లెంత్‌ బంతిని గిల్‌ సరిగా అంచనా వేయకపోవడంతో అది కాస్తా బ్యాట్‌ హెడ్జ్‌ను తగిలి అక్కడే పైకి లేచింది. ఏమాత్రం శ్రమించకుండా ఆర్చర్‌ రిటర్న్‌ క్యాచ్‌ అందుకున్నాడు. తర్వాత రసెల్‌ (14 బంతుల్లో 24; 3 సిక్స్‌లు) స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో 2 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే అతని జోరుకు అంకిత్‌ రాజ్‌పుత్‌ కళ్లెం వేయగా... మోర్గాన్‌ ఆఖరి దాకా నిలువడం... చివరి ఐదు ఓవర్లలో 54 పరుగులు రావడంతో కోల్‌కతా 170 పైచిలుకు పరుగులు చేసింది.

స్మిత్‌ 3... సామ్సన్‌ 8 
మాజీ చాంపియన్‌ చెన్నై, పంజాబ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో రాజస్తాన్‌ 200 పైచిలుకు పరుగులు చేసింది. దీనికి స్టీవ్‌ స్మిత్, సంజూ సామ్సన్‌లే ప్రధాన కారణం. తొలుత బ్యాటింగ్‌కు దిగినా.... తర్వాత లక్ష్యఛేదనకు దిగినా వీళ్లిద్దరు చెలరేగడం వల్లే రాయల్స్‌ గెలిచింది. కానీ ఈ మ్యాచ్‌లో స్మిత్‌ (3), సామ్సన్‌ (8) పట్టుమని పది పరుగులైనా చేయలేకపోవడంతో ప్రత్యర్థి శిబిరం మ్యాచ్‌ గెలిచినంత సంబరం చేసుకుంది. స్మిత్‌ను కమిన్స్, సంజూను శివమ్‌ మావి ఔట్‌ చేశారు. రాజస్తాన్‌ 30 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్‌ ప్లే (6 ఓవర్లు)లో రాయల్స్‌ 39/2 స్కోరు చేసింది.

కమలేశ్‌ కమాల్‌... 
పవర్‌ ప్లే ముగియగానే... నైట్‌రైడర్స్‌ బౌలింగ్‌ ‘పవర్‌’ జూలు విదిల్చింది. వైవిధ్యమైన బంతులేస్తున్న మావి ఈసారి బట్లర్‌ (16 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు)ను ఔట్‌ చేశాడు. ఇది చాలదన్నట్లు నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ యువ పేసర్‌ కమలేశ్‌ నాగర్‌కోటికి బంతి అప్పగించాడు. ఇతను తన తొలి బంతికే ఉతప్ప (2)ను, నాలుగో బంతికి  పరాగ్‌ (1)ను ఔట్‌ చేశాడు. 42 పరుగులకే 5 వికెట్లు కూలాయి. కేవలం 10 బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడిపోవడంతో రాజస్తాన్‌ స్కోరు 50 చేరేందుకే 9 ఓవర్లు అవసరమయ్యాయి. ఆ తర్వాత కూడా కోల్‌కతా బౌలర్ల ధాటికి రాయల్స్‌ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది.  
 
 స్కోరు వివరాలు 
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇన్నింగ్స్‌ : శుబ్‌మన్‌ గిల్‌ (సి అండ్‌ బి) ఆర్చర్‌ 47; నరైన్‌ (బి) ఉనాద్కట్‌ 15; నితీశ్‌ రాణా (సి) పరాగ్‌ (బి) తేవటియా 22; రసెల్‌ (సి) ఉనాద్కట్‌ (బి) అంకిత్‌ రాజ్‌పుత్‌ 24; దినేశ్‌ కార్తీక్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 1; మోర్గాన్‌ (నాటౌట్‌) 34; కమిన్స్‌ (సి) సామ్సన్‌ (బి) టామ్‌ కరన్‌ 12; కమలేశ్‌ (నాటౌట్‌) 8; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 174.  
వికెట్ల పతనం : 1–36, 2–82, 3–89, 4–106, 5–115, 6–149. బౌలింగ్‌: ఆర్చర్‌ 4–0–18–2, అంకిత్‌ రాజ్‌పుత్‌ 4–0–39–1, జైదేవ్‌ ఉనాద్కట్‌ 2–0–14–1, టామ్‌ కరన్‌ 4–0–37–1, శ్రేయస్‌ గోపాల్‌ 4–0–43–0, రియాన్‌ పరాగ్‌ 1–0–14–0, రాహుల్‌ తేవటియా 1–0–6–1.  

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ : బట్లర్‌ (సి) వరుణ్‌ (బి) శివమ్‌ మావి 21; స్మిత్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) కమిన్స్‌ 3; సంజూ సామ్సన్‌ (సి) నరైన్‌ (బి) శివమ్‌ మావి 8; రాబిన్‌ ఉతప్ప (సి) శివమ్‌ మావి (బి) నాగర్‌కోటి 2; రియాన్‌ పరాగ్‌ (సి) గిల్‌ (బి) నాగర్‌కోటి 1; రాహుల్‌ తేవటియా (బి) వరుణ్‌ 14; టామ్‌ కరన్‌ (నాటౌట్‌) 54; శ్రేయస్‌ గోపాల్‌ (సి) దినేశ్‌ కార్తీక్‌ (బి) నరైన్‌ 5; ఆర్చర్‌ (సి) నాగర్‌కోటి (బి) వరుణ్‌ 6; ఉనాద్కట్‌ (సి) నాగర్‌కోటి (బి) కుల్దీప్‌ 9; అంకిత్‌ రాజ్‌పుత్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. 
వికెట్ల పతనం: 1–15, 2–30, 3–39, 4–41, 5–42, 6–66, 7–81, 8–88, 9–106. బౌలింగ్‌: నరైన్‌ 4–0–40–1, కమిన్స్‌ 3–0–13–1, శివమ్‌ మావి 4–0–20–2, కమలేశ్‌ నాగర్‌కోటి 2–0–13–2, వరుణ్‌ 4–0–25–2, కుల్దీప్‌ యాదవ్‌ 3–0–20–1. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement