
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో శ్రీలంక స్టార్ క్రికెటర్ కుశాల్ మెండిస్(Kusal Mendis) శతక్కొట్టాడు. అద్భుత సెంచరీతో మెరిసి.. ఆసియా ఖండంలో వన్డే ఇంటర్నేషనల్స్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా రెండు టెస్టులు, రెండు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
టెస్టు సిరీస్ వైట్‌వాష్
ఇరుజట్ల మధ్య టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసిన స్టీవ్ స్మిత్ బృందం.. వన్డేల్లో మాత్రం శుభారంభం అందుకోలేకపోయింది. కొలంబో వేదికగా లంకతో జరిగిన తొలి వన్డే(Sri Lanka vs Australia)లో 49 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ఆతిథ్య శ్రీలంక 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది.
వన్డేల్లో లంక ఆధిక్యం
ఇదే జోరులో రెండో వన్డేలోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలనే తలంపుతో బరిలోకి దిగింది. కొలంబో(Colombo)లోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆసీస్ పేసర్ ఆరోన్ హార్డీ ఓపెనర్ పాతుమ్ నిసాంక(6)ను స్వల్ప స్కోరు వద్ద బౌల్డ్ చేయడంతో ఆదిలోనే లంకకు ఎదురుదెబ్బ తగిలింది.
అయితే, యువ ఓపెనర్ నిషాన్ మదుష్క.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ కలిసి శ్రీలంక ఇన్నింగ్స్ చక్కదిద్దారు. కంగారూ పేసర్ బెన్ డ్వార్షుయిస్ నిషాన్‌ను అవుట్ చేసి ఈ జంటను విడదీశాడు. 70 బంతులు ఎదుర్కొన్న నిషాన్ 51 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఇక మెండిస్‌తో కలిసి నిషాన్ రెండో వికెట్‌కు 98 పరుగులు జతచేశారు.
జంపా బౌలింగ్‌లో
ఇక నిషాన్ నిష్క్రమణ తర్వాత కూడా చెలరేగిన మెండిస్ శతకం పూర్తి చేసుకున్నాడు. 115 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. అయితే, జంపా బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌కు క్యాచ్ ఇవ్వడంతో కుశాల్ మెండిస్ శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది. కెప్టెన్ చరిత్ అసలంక(66 బంతుల్లో 78 నాటౌట్)తో కలిసి 94 పరుగులు జతచేసి కుశాల్ పెవిలియన్ చేరాడు.
కాగా కుశాల్ మెండిస్‌కు ఆస్ట్రేలియాపై ఇది తొలి వన్డే శతకం కాగా ఓవరాల్‌గా ఐదవది. ఇదిలా ఉంటే.. మిగిలిన వాళ్లలో కమిందు మెండిస్(4) విఫలం కాగా.. జనిత్ లియనగే 21 బంతుల్లో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి శ్రీలంక 281 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ఆరోన్ హార్డీ, డ్వార్షుయిస్, సీన్ అబాట్, ఆడం జంపా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడు.. అతడి స్థానానికి ఎసరు!