టీమిండియా ‘బిగ్‌ స్టార్‌’గా ఎదుగుతాడు.. అతడి స్థానానికి ఎసరు! | Wont be Surprised if This Guy goes on to become Big Star: Sanjay Manjrekar | Sakshi
Sakshi News home page

టీమిండియా ‘బిగ్‌ స్టార్‌’గా ఎదుగుతాడు.. అతడి స్థానానికి ఎసరు!

Published Fri, Feb 14 2025 1:40 PM | Last Updated on Fri, Feb 14 2025 3:27 PM

Wont be Surprised if This Guy goes on to become Big Star: Sanjay Manjrekar

టీమిండియా యువ పేసర్‌ హర్షిత్‌ రాణా(Harshit Rana)పై భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. రానున్న కాలంలో భారత బౌలింగ్‌ దళంలో ‘బిగ్‌ స్టార్‌’గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హర్షిత్‌ అద్భుత ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.

కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హర్షిత్‌.. స్వదేశంలో ఇంగ్లండ్‌(India vs England)తో పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ అరంగేట్రం చేశాడు. తొలుత టీ20లలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ పేసర్‌.. అనంతరం వన్డేల్లోనూ చోటు దక్కించుకున్నాడు.

బుమ్రా స్థానంలో ఐసీసీ టోర్నీకి
ఇంగ్లండ్‌తో ఆడిన టీ20 మ్యాచ్‌లో మూడు వికెట్లతో మెరిసిన  రైటార్మ్‌ ఫాస్ట్‌ మీడియం బౌలర్‌.. మూడు వన్డేల్లో కలిపి ఆరు వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ రెండు సిరీస్‌లలో టీమిండియా గెలవడంలో తాను భాగమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 జట్టులో జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానాన్ని బీసీసీఐ హర్షిత్‌ రాణాతో భర్తీ చేసింది.

ఈ నేపథ్యంలో కామెంటేటర్‌, భారత మాజీ బ్యాటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ హర్షిత్‌ రాణా ఆట తీరును కొనియాడాడు. రాణా రాకతో అర్ష్‌దీప్‌ సింగ్‌కు గట్టి పోటీ తప్పదని అభిప్రాయపడ్డాడు. ‘‘ఇటీవలి కాలంలో హర్షిత్‌ రాణా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది.

టీమిండియా ‘బిగ్‌ స్టార్‌’గా ఎదుగుతాడు
తన ప్రదర్శనతో అతడు జట్టు విజయాలపై ప్రభావం చూపగలిగాడు. అతడి ఆటిట్యూడ్‌ కూడా ముచ్చటగొలిపేలా ఉంది. సమీప భవిష్యత్తులోనే అతడు టీమిండియా బౌలింగ్‌ బిగ్‌ స్టార్‌గా అవతరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఆట పట్ల అతడి అంకితభావం, ఆలోచనా ధోరణి నాకెంతో నచ్చింది. ఏదేమైనా చాంపియన్స్‌ ట్రోఫీ తుదిజట్టులో సీనియర్‌గా అర్ష్‌దీప్‌ సింగ్‌కే ప్రాధాన్యం దక్కుతుంది. అయితే, దీర్ఘ కాలంలో రాణా వల్ల అర్ష్‌దీప్‌నకు కష్టాలు తప్పవు. సెకండ్‌ సీమర్‌గా అతడికి హర్షిత్‌ నుంచి పోటీ ఎదురవుతుంది.

సిరాజ్‌ రీ ఎంట్రీ కష్టమే!
కచ్చితంగా హర్షిత్‌ రాణా అర్ష్‌కు గట్టిపోటీగా మారతాడు. అతడి వల్ల ఇప్పటికే సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పునరాగమనం చేయడం కష్టంగా మారింది’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున  బరిలోకి దిగాడు హర్షిత్‌ రాణా.

గత ఎడిషన్‌లో మొత్తంగా పదమూడు మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లతో మెరిసిన ఈ ఢిల్లీ బౌలర్‌.. కోల్‌కతాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నాడు కోల్‌కతా జట్టు మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్‌ టీమిండియా హెడ్‌కోచ్‌ కావడంతో హర్షిత్‌కు టీమిండియా ఎంట్రీ కాస్త సులువుగానే దక్కింది.

చదవండి: Champions Trophy: ప్రైజ్ మ‌నీ ప్ర‌క‌టించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement