లైఫ్‌ ఇచ్చారు.. మూల్యం చెల్లించుకున్నారు! | Labuschagne Rides His Luck To Hit 5th Test Hundred | Sakshi
Sakshi News home page

 లైఫ్‌ ఇచ్చారు.. మూల్యం చెల్లించుకున్నారు!

Published Fri, Jan 15 2021 11:40 AM | Last Updated on Fri, Jan 15 2021 12:01 PM

Labuschagne Rides His Luck To Hit 5th Test Hundred - Sakshi

బ్రిస్బేన్‌: తనకు లైఫ్‌ ఇస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించాడు ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు లబూషేన్‌. క్యాచ్‌ను వదిలేస్తే సెంచరీతో కదం తొక్కాడు లబూషేన్‌. 37 పరుగుల వద్ద దొరికిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకుని శతకం పూర్తి చేసుకున్నాడు. ఇది లబూషేన్‌కు టెస్టుల్లో ఐదో సెంచరీ. బ్రిస్బేన్‌ టెస్టులో భాగంగా లబూషేన్‌ క్యాచ్‌ను రహానే వదిలేశాడు. నవదీప్‌ సైనీ వేసిన 36 ఓవర్‌ ఐదో బంతికి గల్లీలోకి స్టైయిట్‌ ఫార్వర్డ్‌ క్యాచ్‌ ఇచ్చాడు లబూషేన్‌. దాన్ని రహానే జారవిడిచాడు. పట్టాల్సిన క్యాచ్‌ను వదిలేయడంతో రహానే నిరాశ చెందాడు.  స్టీవ్‌ స్మిత్‌ ఔటైన తర్వాత ఓవర్‌లో లబూషేన్‌ క్యాచ్‌ ఇచ్చినా అది నేలపాలైంది. కానీ ఆ తర్వాత  మళ్లీ లబూషేన్‌ చాన్స్‌ ఇచ్చాడు.

లబూషేన్‌ ఇచ్చిన మరొక క్యాచ్‌ ఫస్ట్‌ స్టిప్‌లో పుజారా ముందు పడిపోవడంతో మళ్లీ బ్రతికిపోయాడు. ఆ తర్వాత హాఫ్‌ సెంచరీని శతకంగా మలచుకున్నాడు లబూషేన్‌. శతకంతో  ఆసీస్‌ తేరుకోగా, టీమిండియా మూల్యం చెల్లించుకున్నట్లయ్యింది. 195 బంతుల్లో 9 ఫోర్లతో సెంచరీ సాధించాడు లబూషేన్‌.  మాథ్యూవేడ్‌(45;87 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి 113 పరుగులు జత చేశాడు లబూషేన్‌. కాగా, ఆసీస్‌ స్కోరు రెండొందల వద్ద ఉండగా వేడ్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. కాగా, సెంచరీ సాధించిన తర్వాత లబూషేన్‌ ఎంత సేపో క్రీజ్‌లో నిలవలేదు. నటరాజన్‌ వేసిన 66 ఓవర్‌ ఐదో బంతికి పంత్‌కు క్యాచ్‌ లబూషేన్‌ ఔటయ్యాడు. (రోహిత్‌ ‘బౌలింగ్‌’ మార్చాడు)

నటరాజన్‌కు తొలి వికెట్‌
మాథ్యూవేడ్‌ను నటరాజన్‌ ఔట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన నటరాజన్‌.. వేడ్‌ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్‌ 64 ఓవర్‌ నాల్గో బంతికి వేడ్‌ పెవిలియన్‌ చేరాడు. అవుట్‌ సైడ్‌ ఆప్‌ స్టంప్‌కు వేసిన గుడ్‌ లెంగ్త్‌లో వేసిన బంతిని పుల్‌ చేయబోయిన వేడ్‌.. శార్దూల్‌ ఠాకూర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.  ఆ బంతి ఎడ్జ్‌ తీసుకోవడంతో క్యాచ్‌గా లేచింది.  ఆ క్యాచ్‌ను పట్టడానికి నటరాజన్‌  పరుగెత్తగా,  శార్దూల్‌ ఠాకూర్‌ను చూసి వెనక్కి తగ్గాడు.  ఈ ఇద్దరు క్రికెటర్ల సమన్వయంతో వేడ్‌ పెవిలియన్‌ బాట పట్టాడు.   ఆపై లబూషేన్‌ను సైతం నటరాజన్‌ పెవిలియన్‌కు పంపాడు. దాంతో 213 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 204 బంతుల్లో 108 పరుగులు చేసి లబూషేన్‌ ఔటయ్యాడు. (లెఫ్టార్మ్‌ సీమర్‌ను చూసి ఎంత కాలమైందో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement