ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ వరుసగా సంచలన విషయాలు వెల్లడిస్తూ వస్తున్నాడు. ఇటీవలే ‘హ్యూమన్ బాంబే’ అనే పాడ్‌కాస్ట్‌కు లలిత్ మోదీ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటికే లక్నో సూపర్‌జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకాపై విరుచుకుపడిన లలిత్ మోదీ తాజాగా ఐపీఎల్ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన చీర్ లీడర్స్‌తో క్రికెటర్ల ప్రేమాయణాలకు సంబంధించిన విషయాలను బయపెట్టడం ఆసక్తి రేపింది.
చీర్‌లీడర్స్ ఐపీఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారనే ఉద్దేశంతోనే వారిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నాడు. టోర్నమెంట్ సమయంలో జరిగే మైదానం వెలుపలి వివాదాలలో అధికభాగం ముందు రాసుకునే స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని తెలిపాడు. ఐపీఎల్ చూసే వీక్షకుల రేటింగ్‌లు పడిపోతే, హైప్ సృష్టించడం కోసం ఐపీఎల్ థింక్-ట్యాంక్ ఉద్దేశపూర్వకంగా మీడియాలో వార్తలను ప్రచారం చేస్తుందన్నారు.
ఈ నేపథ్యంలోనే ఒక దక్షిణాఫ్రికా ఆటగాడు చీర్ లీడర్‌తో సంబంధం కొనసాగిస్తున్నాడన్న వార్తను తానే వ్యాప్తి చేశానంటూ లలిత్ మోదీ బాంబు పేల్చాడు.అయితే కొందరు క్రికెటర్లు చీర్‌లీడర్స్‌తో ప్రేమ మత్తులో మునిగి తేలుతున్నట్లు వార్తలు సృష్టించడం లాంటివన్నీ ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించాడు.
ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించడం, వారు వ్యూయర్‌షిప్ కోసం దానికి మరింత హంగులు అద్ది రేటింగ్స్‌ను పెంచుకోవడానికి ఆయుధంలా వాడుకునేవారు. సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ చీర్ లీడర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తాము బహిరంగపరిచిన మాట వాస్తవమే. కానీ కొన్ని చానెళ్లు మాత్రం దిగజారి డికాక్ చీర్‌లీడర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ రాసుకొచ్చాయి.
ఇది వారి టీఆర్పీ రేటింగ్‌ను పెంచేసి ఉండొచ్చు.. కానీ ఒక క్రికెటర్ కెరీర్‌కు ఇదొక మాయని మచ్చలా మిగిలిపోతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సౌతాఫ్రికా డికాక్ ఆ చీర్‌లీడర్‌నే పెళ్లి చేసుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో చీర్ లీడర్స్‌ను పెళ్లి చేసుకున్న క్రికెటర్ల గురించి ఒక లుక్కేద్దాం.
👉డికాక్, షాషా హర్లీ..
సౌతాఫ్రికా సీనియర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్, షాషా హర్లీల ప్రేమకథ, వివాహబంధంలోకి అడుగుపెట్టడం ఒక చిన్నపాటి సినిమా కథలాగా ఉంటుంది. 2012లో చాంపియన్స్ లీగ్ టీ20 టోర్నీ జరిగిన సమయంలో డికాక్ హైవైల్డ్ లయన్స్ తరఫున ఆడుతున్నాడు. అదే జట్టుకు షాషా హర్లీ చీర్‌లీడర్‌గా పనిచేసినట్లు సమాచారం.

టోర్నీ జరిగిన సమయంలోనే డికాక్‌తో షాషా హర్లీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరు రిలేషన్‌షిప్‌లో మునిగి తేలారు. 2015లో నిశ్చితార్థం చేసుకున్న డికాక్, షాషాహర్లీలు మరుసటి ఏడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు. 2022లో ఈ జంట తమ మొదటి బిడ్డ కియారాకు స్వాగతం పలికారు. అప్పటినుంచి డికాక్ ఏ టోర్నీకి వెళ్లినా షాషా హర్లీ తన వెంటే వస్తూ అతన్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
👉మహ్మద్ షమీ, హసిన్ జహాన్..
చీర్‌లీడర్‌ను పెళ్లిచేసుకున్న మరో క్రికెటర్ మహ్మద్ షమీ. 2012 ఐపీఎల్ సీజన్‌లో మాజీ మోడల్ హసీన్ జహాన్ చీర్‌లీడర్‌గా పనిచేసింది. ఈ సీజన్‌లోనే షమీ మొదటిసారి ఆమెను కలిశాడు. మాటల మధ్యలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం ఇద్దరు ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత 2014 జూన్ 6న మొరాదాబాద్‌లో కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.
పెళ్లి తర్వాత హసీన్ జహాన్ చీర్ లీడర్ పాత్రకు ఫుల్‌స్టాప్ పెట్టింది. 2015లో ఈ దంపతులు ఐరా షమీకి స్వాగతం పలికారు. అయితే నాలుగేళ్లకే వీరి వివాహబంధం ముగిసింది. షమీపై శారీరక వేధింపులు, గృహహింస కేసులు పెట్టిన హసీన్ జహాన్ షమీతో విడాకులు తీసుకొని విడిపోయింది.
అలా క్రికెటర్లలో చీర్ లీడర్స్‌ను పెళ్లి చేసుకున్న ఇద్దరిలో ఒకరు తమ వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటే.. మరొకరు మాత్రం వివాహబంధం విచ్ఛిన్నం కావడంతో ఒంటరిగా మిగిలిపోయాడు.


