టీ20ల్లో అరుదైన ప్రదర్శన నమోదైంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా దర్బార్ రాజ్‌షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఢాకా క్యాపిటల్స్ ఆటగాళ్లు (తంజిద్ హసన్ తమీమ్, లిటన్ దాస్) సెంచరీలు చేశారు. టీ20ల్లో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది తొమ్మిదో సారి.
టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేసిన సందర్భాలు..
కెవిన్ ఓ'బ్రియన్ & హమీష్ మార్షల్ vs మిడిల్‌సెక్స్, ఉక్స్‌బ్రిడ్జ్, 2011
విరాట్ కోహ్లీ & ఎబి డివిలియర్స్ vs గుజరాత్ లయన్స్, బెంగళూరు, 2016
అలెక్స్ హేల్స్ & రిలీ రోసౌ vs చిట్టగాంగ్ వైకింగ్స్, చట్టోగ్రామ్, 2019
డేవిడ్ వార్నర్ & జానీ బెయిర్‌స్టో vs ఆర్‌సిబి, హైదరాబాద్, 2019
సబావూన్ డేవిజి & డిలాన్ స్టెయిన్ vs బల్గేరియా, మార్సా, 2022
లాచ్లాన్ యమమోటో-లేక్ & కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ vs చైనా, మోంగ్ కోక్, 2024
శుభ్‌మన్ గిల్ & బి సాయి సుదర్శన్ vs CSK, అహ్మదాబాద్, 2024
సంజు సామ్సన్ & తిలక్ వర్మ vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2024
తాంజిద్ హసన్ తమీమ్ & లిట్టన్ దాస్ vs దర్బార్ రాజ్‌షాహి, సిల్హెట్, 2025
మ్యాచ్ విషయానికొస్తే.. దర్బార్ రాజ్‌షాహీతో జరిగిన మ్యాచ్‌లో ఢాకా క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేసి రికార్డు స్కోర్ చేసింది. తంజిద్ హసన్ (64 బంతుల్లో 108; 6 ఫోర్లు, 8 సిక్సర్లు), లిటన్ దాస్ (55 బంతుల్లో 125 నాటౌట్; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో ఢాకా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 254 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్.
ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్ 44 బంతుల్లో శతక్కొట్టాడు. బీపీఎల్‌లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బంగ్లాదేశ్ జట్టును నిన్ననే ప్రకటించారు. ఈ జట్టులో లిటన్ దాస్‌కు చోటు దక్కలేదు. తనను జట్టు నుంచి తప్పించిన రోజే దాస్ సెంచరీతో కదంతొక్కడం విశేషం.
ఈ మ్యాచ్‌లో లిటన్ దాస్, తంజిద్ హసన్ తొలి వికెట్‌కు 241 పరుగులు జోడించారు. బీపీఎల్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. టీ20 క్రికెట్ చరిత్రలో ఏ వికెట్‌కు అయినా ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. టీ20ల్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు జపాన్ ఆటగాళ్లు యమమోటో, కడోవాకీ పేరిట ఉంది. ఈ జోడీ 2024లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన 258 పరుగులు జోడించింది.
ఢాకా క్యాపిటల్స్ నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దర్బార్ రాజ్‌షాహీ చేతులెత్తేసింది. ఆ జట్టు 15.2 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఢాకా క్యాపిటల్స్ 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇదే భారీ విజయం. ఈ సీజన్‌లో ఢాకా క్యాపిటల్స్‌కు ఇదే తొలి విజయం. ఈ మ్యాచ్‌కు ముందు ఢాకా క్యాపిటల్స్ ఆరు మ్యాచ్‌లు ఆడగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment