
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2024లో సిల్హెట్ స్ట్రయికర్స్ ఆటగాడు బెన్నీ హోవెల్ (ఇంగ్లండ్) వీర బాదడు బాదాడు. కొమిల్లా విక్టోరియన్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్.. హోవెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.
స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో హోవెల్ మినహా మిగతా ఆటగాళ్లు పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. కెన్నార్ లెవిస్ 33, జాకిర్ హసన్ 18, షాంటో 12, యాసిర్ అలీ 2, కెప్టెన్ మిథున్ 28 పరుగులు చేశారు. విక్టోరియన్స్ బౌలర్లలో సునీల్ నరైన్ పొదుపుగా (4-1-16-2) బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టగా.. రషీద్ హొసేన్ 2, ముస్ఫిక్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య ఛేదనలో విక్టోరియన్స్ చివరివరకు పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లిటన్ దాస్ (85) విక్టోరియన్స్‌ను గెలిపించేందుకు సకల ప్రయత్నాలు చేశాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (23) కూడా తనవంతు ప్రయత్నించినప్పటికీ విక్టోరియన్స్ గెలవలేకపోయింది.
లక్ష్యానికి 13 పరుగుల దూరంలో (165/6) నిలిచిపోయి, ఓటమిపాలైంది. విక్టోరియన్స్ కీలక ఆటగాళ్లు జాన్సన్ చార్లెస్ (17), మొయిన్ అలీ (0) విఫలమయ్యారు. స్ట్రయికర్స్ బౌలర్లలో తంజిమ్ హసన్ సకీబ్ 3, సమిత్ పటేల్, షఫీకుల్ ఇస్లాం, బెన్నీ హోవెల్ తలో వికెట్ పడగొట్టారు.