IPL 2023, LSG Vs RCB: Naveen-Ul-Haq Fires Back At Virat Kohli With Cryptic Instagram Story, Pic Viral - Sakshi
Sakshi News home page

Naveen-Ul-Haq Cryptic Instagram Story: కోహ్లితో వివాదం అనంతరం నవీన్‌ ఉల్‌ హాక్‌ ఆసక్తికర పోస్ట్‌

Published Tue, May 2 2023 12:41 PM | Last Updated on Tue, May 2 2023 1:17 PM

LSG Player Naveen Ul Haq Instagram Story After Fight With Kohli - Sakshi

అటల్‌ బిహారీ వాజ్‌పేయ్‌ మైదానం వేదికగా నిన్న (మే 1) లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం మైదానంలో చోటు చేసుకున్న పరిణామాలు సైతం అందరికీ విధితమే. లక్నో ప్లేయర్‌ నవీన్‌ ఉల్‌ హాక్‌- విరాట్‌ కోహ్లిల మధ్య మొదలైన చిన్నపాటి మాటల యుద్ధం చినిచినికి గాలి వానలా మారి, జెంటిల్మెన్‌ గేమ్‌కు మాయని మచ్చ తెచ్చింది.

మ్యాచ్‌ అనంతరం గొడవకు కారకులైన నవీన్‌, కోహ్లి తమ సోషల్‌మీడియా ఖాతాల్లో చేసిన పోస్ట్‌లు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. కోహ్లి తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు.. మనం వినే ప్రతీ విషయం ఎవరో ఒకరి అభిప్రాయం మాత్రమే. అదే నిజం కాదు. మనం చూసే ప్రతీది వాస్తవం కాదు. మన దృక్కోణానికి సంబంధించింది మాత్రమే అని అర్థం వచ్చేలా ఓ కోట్‌ను షేర్‌ చేశాడు.

నవీన్‌ ఉల్‌ హాక్‌ విషయానికొస్తే.. ఈ ఆఫ్ఘనిస్తాన్‌ ప్లేయర్‌ తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు. మీకు అర్హమైనది మీకు దక్కుతుంది. అది ఎలాగైనా జరిగి తీరుతుంది అని అర్ధం వచ్చేలా ఓ కోట్‌ని షేర్‌ చేశాడు. కోహ్లి-నవీన్‌లు ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్‌లు చేశారో తెలియదు కానీ, మ్యాచ్‌ అనంతరం జరిగిన పరిణామాలను మనసులో ఉంచుకునే ఈ కోట్స్‌ షేర్‌ చేశారన్నది సుస్పష్టం. 

కాగా, ఆర్సీబీ నిర్ధేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ తొలి బంతి తర్వాత నవీన్‌-కోహ్లిల మధ్య తొలిసారి మాటల యుద్ధం జరిగింది. ఊహించినంత త్వరగా విజయం దక్కకపోవడంతో (మిశ్రా, నవీన్‌ ఔటవ్వకుండా ఆడుతున్నారు) అసహనంతో ఉండిన కోహ్లి.. తొలుత మిశ్రాపై, ఆతర్వాత నవీన్‌పై నోరు పారేసుకున్నాడు.

అంతటితో ఆగకుండా నవీన్‌వైపు షూ చూపిస్తూ దుర్భాషలాడినట్లు టీవీల్లో కనిపించింది. మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో మరోసారి కోహ్లి-నవీన్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో గంభీర్‌ జోక్యంతో ఈ వివాదం పెద్దదైంది. గంభీర్‌-కోహ్లి ఇద్దరూ కొట్టుకునేంత దాకా వెళ్లారు. ఆ సమయంలో మైదానం రణరంగాన్ని తలపించింది. ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకున్న రిఫరీ.. కోహ్లి-గంభీర్‌ల మ్యాచ్‌ ఫీజుల్లో 100 శాతం.. నవీన్‌ మ్యాచ్‌ ఫీజ్‌లో 60 శాతం కోత విధించాడు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement