భారత హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. కోటి రూపాయల రివార్డుతో సత్కరించనుంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు. జాతి మొత్తాన్ని గర్వపడేలా చేశారంటూ వివేక్‌తో పాటు భారత హాకీ జట్టు ఆటగాళ్లందరినీ ప్రశంసించారు.
వరుస ఒలింపిక్స్‌లో
కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. స్పెయిన్‌తో గురువారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన 2-1తో విజయం సాధించింది.
టోక్యో ఫలితాన్ని పునరావృతం చేస్తూ మరోసారి మెడల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించిన హాకీ జట్టుగా నిలిచింది. విశ్వ క్రీడల్లో హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్‌కు ఒలింపిక్స్‌లో ఇది 13వ పతకం.
వివేక్‌కు ఇప్పటికే డీఎస్పీ ఉద్యోగం
ఈ నేపథ్యంలో హాకీ ఇండియా కాంస్యం గెలిచిన జట్టులోని ఆటగాళ్లకు నజరానా ప్రకటించింది. ప్లేయర్లలో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత వివేక్ సాగర్ ప్రసాద్‌కు ఫోన్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్.. ‘‘అద్బుతమైన ప్రదర్శన.
దేశం మొత్తం మిమ్మల్ని చూసి సంతోషిస్తోంది. జట్టుకు అభినందనలు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీ అకౌంట్‌కు కోటి రూపాయలు రివార్డుగా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సూపరింటెండ్ ఆఫ్ పోలీసుగా మీరు పనిచేస్తున్నారు. మీకు ఈ కోటి రూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
అమిత్‌కు రూ. 4 కోట్లు
కాగా టోక్యోలో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడైన వివేక్‌కు నాటి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో పాటు కోటి రూపాయలు ఇచ్చింది. మరోవైపు.. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ తమ హాకీ స్టార్ అమిత్ రోహిదాస్‌కు రూ. 4 కోట్ల నజరానా ప్రకటించారు. జట్టులోని ఇతర సభ్యులకు రూ. 15 లక్షల చొప్పున అందిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment