March 13, 2023 becomes Memorable Day for Indians - Sakshi
Sakshi News home page

ఓ పక్క నాటు నాటు పాటకు ఆస్కార్‌.. మరో పక్క నీటు నీటు ఆటకు..! 

Published Mon, Mar 13 2023 1:43 PM | Last Updated on Tue, Mar 14 2023 10:57 AM

March 13 2023 Becomes Memorable Day For Indians - Sakshi

మార్చి 13, 2023.. భారతీయులకు చిరకాలం గుర్తుండి పోయే రోజు ఇది. విశ్వవేదికపై ఈ రోజు రెండు విషయాల్లో భారత కీర్తి పతాకం రెపరెపలాడింది. భారతీయ చిత్ర గీతానికి, మరి ముఖ్యంగా తెలుగు పాట "నాటు.. నాటు (ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలోని పాట)"కు ఈ రోజున ప్రతిష్టాత్మక ఆస్కార్‌ (అకాడమీ) అవార్డు దక్కగా.. ఇదే రోజున భారత క్రికెట్‌ జట్టు వరుసగా రెండో సారి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరింది. 

సినిమా, క్రీడా రంగానికి సంబంధించి మరపురానిదిగా మిగిలిపోయే ఈ రోజున యావత్‌ భారతావణి సంబురాలు చేసుకుంటుంది. ముఖ్యంగా సినిమా అభిమానులు, అందులోనూ తెలుగువారి ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. నాటు.. నాటు పాట ఆస్కార్‌ గెలవడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

 

RRR టీమ్‌కు యావత్‌ సినీ జగత్తు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిత్ర దర్శకుడు రాజమౌళి, కథానాయకులు రామ్‌చరణ్‌, తారక్‌లతో పాటు నాటు.. నాటుకు బాణీలు సమకూర్చిన ఎంఎం కీరవాణికి, సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్‌కు, గాత్రాన్ని అందించిన కాళభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌లకు, కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్‌ రక్షిత్‌లపై విశ్వవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాటు నాటు పాటకు సగం‍ జీవం పోసింది సంగీతమైతే.. చరణ్‌, తారక్‌లు తమ అత్యుత్తమ నృత్య ప్రావీణ్యంతో ఈ పాటకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చారని అభామానులు జేజేలు పలుకుతున్నారు. 

మరోవైపు భారత్‌ క్రికెట్‌ జట్టుకు, విశ్వవ్యాప్తంగా ఉన్న టీమిండియా ఫాలోవర్స్‌కు కూడా ఈ రోజు చిరకాలం గుర్తుండి పోతుంది. భారత క్రికెట్‌ జట్టు వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఎడిషన్‌లో (2021-23) ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న భారత్‌.. ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ శ్రీలంకపై న్యూజిలాండ్‌ విజయం సాధించడంతో టీమిండియా దర్జాగా ఫైనల్‌కు చేరింది.   

డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌ రేసులో భారత్‌తో పోటీ పడిన శ్రీలంకను న్యూజిలాండ్‌ మాజీ సారధి కేన్‌ విలియమ్సన్‌ (121 నాటౌట్‌) సూపర్‌ శతకంతో దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి భారత్‌ ఫైనల్‌ అవకాశాలను సంక్లిష్టం చేయాలనుకున్న లంకేయుల ఆశలపై కేన్‌ మామ నీళ్లు చల్లాడు. ఒక​ దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు, తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement