అద్భుత క్యాచ్‌తో మెరిసిన మార్క్రమ్ (PC: ICC Insta)
టీ20 ప్రపంచకప్-2024లో దక్షిణాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌లతో కలిసి గ్రూప్-డిలో భాగమైన ప్రొటిస్ జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు ఆడేసింది.
తొలుత శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన మార్క్రమ్ బృందం.. ఆ తర్వాత నెదర్లాండ్స్ పనిపట్టింది. నాలుగు వికెట్ల తేడాతో ఆ జట్టును ఓడించి.. గ్రూప్-డి టాపర్‌గా నిలిచింది.
ఇక తాజాగా సోమవారం నాటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో.. చివరికి పైచేయి సాధించింది. నాలుగు పరుగుల స్వల్ప తేడాతో నజ్ముల్ షాంటో బృందాన్ని ఓడించిన సౌతాఫ్రికా.. ఈ ఎడిషన్‌లో సూపర్-8 చేరిన తొలి జట్టుగా నిలిచింది.
న్యూయార్క్ వేదికగా ఆద్యంతం ఆసక్తి రేపిన ఈ మ్యాచ్‌లో.. టాస్ గెలిచి ప్రొటిస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్(18) ఒక్కడు కాస్త ఫర్వాలేదనిపించగా.. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(0), కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్(4) పూర్తిగా నిరాశపరిచారు.
నాలుగో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ సైతం సున్నాకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో పీకల్లోతు కష్టాలో ఉన్న సౌతాఫ్రికాను హెన్రిచ్ క్లాసెన్ గట్టెక్కించాడు.
తన శైలికి భిన్నంగా ఆచితూచి ఆడుతూ 44 బంతుల్లో 46 పరుగులు సాధించాడు క్లాసెన్. అతడికి తోడుగా డేవిడ్ మిల్లర్(29) రాణించాడు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.
ఇక లక్ష్యం స్వల్పంగానే కనిపిస్తున్నా.. బ్యాటింగ్‌కు అనుకూలించని న్యూయార్క్ పిచ్‌పై బంగ్లాదేశ్ పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడింది. టాపార్డర్‌లో కెప్టెన్ నజ్ముల్ షాంటో(14) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా.. తౌహీద్ హృదయ్(37), మహ్మదుల్లా(20) బంగ్లా శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించారు.
సౌతాఫ్రికాపై గెలవాలంటే ఆఖరి ఓవర్‌లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. కేవలం ఆరు పరుగులే వచ్చాయి. అయితే, ఈ ఓవర్ ఆసాంతం ఎంతో ఆసక్తిగా సాగింది.
డెత్ ఓవర్‌లో మార్క్రమ్ తమ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ చేతికి బంతినివ్వగా.. అతడు వైడ్‌తో ఆరంభించాడు. దీంతో బంగ్లా విజయ సమీకరణం ఆరు బంతుల్లో 10 పరుగులుగా మారింది.
ఈ క్రమంలో మహ్మదుల్లా 1, జాకిర్ అలీ 2 పరుగులు తీయగా.. నాలుగు బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. అయితే, అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. మహరాజ్ బౌలింగ్‌లో జాకిర్ అలీ(8) ఇచ్చిన క్యాచ్‌ను మార్క్రమ్ ఒడిసిపట్టాడు.
ఆ తర్వాతి బంతికి లెగ్‌బై రూపంలో ఒక పరుగు రాగా.. రెండు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మహరాజ్ బౌలిండ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మహ్మదుల్లా బౌండరీ దిశగా బంతిని గాల్లోకి లేపాడు.
అయితే, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మార్క్రమ్ ఊహించని రీతిలో క్యాచ్ అందుకోగా.. మహ్మదుల్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా టస్కిన్ అహ్మద్ ఒక్కటి మాత్రమే తీయగలిగాడు.
చదవండి: జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది ఘాటు వ్యాఖ్యలు
దీంతో సౌతాఫ్రికా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-8లో అడుగుపెట్టింది. నిజానికి మార్క్రమ్ గనుక మహ్మదుల్లా క్యాచ్ వదిలేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. అయితే, బ్యాటింగ్‌లో విఫలమైనా తన కెప్టెన్సీ, అద్బుత ఫీల్డింగ్‌తో మార్క్రమ్ సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment