![Markram Shines Sunrisers Eastern Cape Reach SA20 Qualifier 2 JSK Eliminated](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/sat.jpg.webp?itok=3cmH8sqm)
సన్‌రైజర్స్ ఘన విజయం(PC: SA20 X)
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్(Sunrisers Eastern Cape) మరోసారి టైటిల్ రేసులో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో జొబర్గ్ సూపర్ కింగ్స్(Joburg Super Kings)ను చిత్తు చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. కాగా 2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్(SA20)లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఈస్టర్న్ కేప్ జట్టు అరంగేట్ర చాంపియన్‌గా నిలిచింది.
గతేడాది కూడా మార్క్రమ్ సారథ్యంలోని ఈ జట్టు విజేతగా అవతరించి వరుసగా రెండోసారి టైటిల్ గెలిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా టైటిల్‌కు గురిపెట్టిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఎస్‌ఏ20- 2025 ఆరంభంలో మాత్రం చేదు అనుభవాలు ఎదుర్కొంది.
హ్యాట్రిక్ పరాజయాలు
జనవరి 9న లీగ్ తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ చేతిలో 97 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చిత్తుగా ఓడింది. అనంతరం రాయల్ పర్ల్స్ చేతిలోనూ తొమ్మిది వికెట్ల తేడాతో పరాభవం పాలైంది. ఆ తర్వాత ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి.. హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది.
ఆపై విజయాల బాట పట్టి
అయితే, నాలుగో మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌పై గెలుపొంది విజయాల బాట పట్టిన సన్‌రైజర్స్.. ఆపై వరుసగా మూడు మ్యాచ్‌లలో జయభేరి మోగించి ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. లీగ్ దశలో మొత్తంగా పది మ్యాచ్‌లో ఐదింట గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సన్‌రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.
ఇందులో భాగంగా బుధవారం రాత్రి జొబర్గ్ సూపర్ కింగ్స్‌తో తలపడింది సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు. సెంచూరియన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 184 పరుగులు చేసింది.
మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఓపెనర్లు బెడింగ్‌హాం(14 బంతుల్లో 27), టోనీ డి జోర్జి(9 బంతుల్లో 14) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించగా.. జోర్డాన్ హెర్మాన్(16 బంతుల్లో 12), అబెల్(10 బంతుల్లో 10) నిరాశపరిచారు. ఈ క్రమంలో ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నలభై బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
మిగతా వాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ 21 బంతుల్లో 26 పరుగులు చేయగా.. ఆఖర్లో మార్కో జాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్(12 బంతుల్లో 23) ఆడాడు. ఫలితంగా సన్‌రైజర్స్ మంచి స్కోరు(184-6) నమోదు చేయగలిగింది. జొబర్గ్ సూపర్ కింగ్స్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, విల్‌జోయెన్ రెండేసి వికెట్లు దక్కించుకోగా.. మహీశ్ తీక్షణ, మొయిన్ అలీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
సూపర్ కింగ్స్ ఎలిమినేట్
ఇక లక్ష్య ఛేదనలో జొబర్గ్ శుభారంభమే అందుకున్నా దానిని కొనసాగించలేకపోయింది. ఓపెనర్లలో డెవాన్ కాన్వే(20 బంతుల్లో 30) రాణించగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(18 బంతుల్లో 19) మాత్రం విఫలమయ్యాడు. మిగిలిన ఆటగాళ్లలో జేపీ కింగ్(9), విహాన్ ల్యూబే(13), మొయిన్ అలీ(0), హార్డస్ విల్‌జోయెన్(14) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో ధనాధన్ దంచికొట్టాడు.
కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా ఇవాన్ జోన్స్(17 బంతుల్లో 22నాటౌట్) రాణించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి ఏడు వికెట్లు నష్టపోయిన జొబర్గ్ సూపర్ కింగ్స్ 152 పరుగులకే పరిమితమైంది. దీంతో 32 పరుగుల తేడాతో గెలుపొందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. జొబర్గ్‌ను ఎలిమినేట్ చేసి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.
క్వాలిఫయర్-2లో పర్ల్ రాయల్స్‌తో ఢీ
సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక తదుపరి గురువారం నాటి క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పర్ల్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శనివారం జరిగే ఫైనల్లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌తో టైటిల్ కోసం తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment