లక్నో: ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలిసారి మ్యాచ్ వర్షార్పణమైంది. లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌కు అకాల వర్షం అంతరాయం కలిగించడంతో అర్ధంతరంగా ముగిసింది. మైదానం తడిగా ఉండటంతో 15 నిమిషాలు ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు సాధించింది.
ఈ దశలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో ఫలితం నిర్ణయించేందుకు చెన్నై ఇన్నింగ్స్‌ను కనీసం ఐదు ఓవర్ల పాటైనా నిర్వహించేందుకు సాధ్యపడలేదు. దాంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. చెన్నై బౌలర్ల దెబ్బకు ఒకదశలో లక్నో 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అయితే ఆయుశ్ బదోని (33 బంతుల్లో 59 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (31 బంతుల్లో 20) ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించి ఆదుకోవడంతో లక్నో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment