మాక్సీ మెరుపులు.. నిప్పులు చెరిగిన ఆసీస్‌ పేసర్లు.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌ | Maxwell Strikes Australia Beat Pakistan By 29 Runs in 7 Overs Per Side T20I Game | Sakshi
Sakshi News home page

మాక్సీ మెరుపులు.. నిప్పులు చెరిగిన ఆసీస్‌ పేసర్లు.. చిత్తుగా ఓడిన పాకిస్తాన్‌

Published Thu, Nov 14 2024 5:47 PM | Last Updated on Thu, Nov 14 2024 6:10 PM

Maxwell Strikes Australia Beat Pakistan By 29 Runs in 7 Overs Per Side T20I Game

పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బ్రిస్బేన్‌ వేదికగా పర్యాటక జట్టును చిత్తుగా ఓడించి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. గాబా స్టేడియంలో ఆసీస్‌- పాక్‌ మధ్య గురువారం తొలి టీ20 జరిగింది.

వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ టీ20 మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు మాథ్యూ షార్ట్‌(7), జేక్‌ ఫ్రేజర్‌ మెగర్క్‌(9) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పెవిలియన్‌ చేరారు.

ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మాక్సీ చెలరేగగా
అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌(19 బంతుల్లో 43) రాకతో సీన్‌ మారింది. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మాక్సీ చెలరేగగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌(10) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో మాక్సీకి తోడైన మార్కస్‌ స్టొయినిస్‌(7 బంతుల్లో 21 నాటౌట్‌) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

మాక్సీ, స్టొయినిస్‌ విధ్వంసకర బ్యాటింగ్‌ కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత ఏడు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. పాక్‌ బౌలర్లలో అబ్బాస్‌ ఆఫ్రిది రెండు వికెట్లు తీయగా.. షాహిన్‌ ఆఫ్రిది, నసీం షా ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఆరంభం నుంచే పాక్‌ తడ‘బ్యాటు’
అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే పాక్‌ తడ‘బ్యాటు’కు గురైంది. ఆసీస్‌ పేసర్లు నిప్పులు చెరగడంతో 64 పరుగులకే చేతులెత్తేసింది. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌(8)ను అవుట్‌ చేసి స్పెన్సర్‌ జాన్సన్‌ వికెట్ల వేట మొదలుపెట్టగా.. జేవియర్‌ బార్ట్‌లెట్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(0)ను డకౌట్‌ చేశాడు. అనంతరం ఉస్మాన్‌ ఖాన్‌(4)ను కూడా అతడు పెవిలియన్‌కు పంపాడు.

ఆ తర్వాత నాథన్‌ ఎల్లిస్‌ బాబర్‌ ఆజం(3)తో పాటు.. ఇర్ఫాన్‌ ఖాన్‌(0) వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో మరోసారి రంగంలోకి దిగిన బార్ట్‌లెట్‌ ఆఘా సల్మాన్‌(4)ను వెనక్కి పంపగా.. నాథన్‌ ఎల్లిస్‌ హసీబుల్లా ఖాన్‌(12) పనిపట్టాడు. 

అయితే, అబ్బాస్‌ ఆఫ్రిది(20 నాటౌట్‌)తో కలిసి టెయిలెండర్‌ షాహిన్‌ ఆఫ్రిది(6 బంతుల్లో 11) బ్యాట్‌ ఝులిపించే ప్రయత్నం చేయగా.. ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడం జంపా అతడిని బౌల్డ్‌ చేశాడు. అనంతరం..  పాక్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి వికెట్‌గా నసీం షాను బౌల్డ్‌ చేసి వెనక్కి పంపించాడు. 

64 పరుగులకే
ఈ క్రమంలో పాకిస్తాన్‌ ఏడు ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 64 రన్స్‌ చేసింది. ఫలితంగా ఆసీస్‌ చేతిలో 29 పరుగుల తేడాతో ఓడిపోయింది. అద్భుత బ్యాటింగ్‌తో అలరించి ఆసీస్‌ను గెలిపించిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఇరుజట్ల మధ్య శనివారం సిడ్నీ వేదికగా రెండో టీ20 నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

చదవండి: IPL 2025: సీఎస్‌కే కన్నేసిన చిన్నోడు శతక్కొట్టాడు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement