మ్యాక్స్‌వెల్‌ను అధిగమించిన స్టోయినిస్‌ | Most Runs For Melbourne Stars, Stoinis Surpasses Maxwell To Join Elite Club | Sakshi
Sakshi News home page

మ్యాక్స్‌వెల్‌ను అధిగమించిన స్టోయినిస్‌

Jan 1 2025 8:12 PM | Updated on Jan 1 2025 8:12 PM

Most Runs For Melbourne Stars, Stoinis Surpasses Maxwell To Join Elite Club

బిగ్‌బాష్‌ లీగ్‌లో మార్కస్‌ స్టోయినిస్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. బ్రిస్బేన్‌ హీట్‌తో ఇవాళ (జనవరి 1) జరిగిన మ్యాచ్‌లో స్టోయినిస్‌ ఈ ఘనత సాధించాడు. స్టోయినిస్‌ ఈ భారీ రికార్డు సాధించే క్రమంలో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ రికార్డును అధిగమించాడు. 

స్టోయినిస్‌కు ముందు మ్యాక్సీ మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. స్టోయినిస్‌ మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున 2850 పరుగులు చేయగా.. మ్యాక్స్‌వెల్‌ 2845 పరుగులు చేశాడు. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టోయినిస్‌, మ్యాక్స్‌వెల్‌ తర్వాత లూక్‌ రైట్‌ (1479), హిల్టన్‌ కార్ట్‌రైట్‌ (1429), కెవిన్‌ పీటర్సన్‌ (1110) ఉన్నారు.

మెల్‌బోర్న్‌ స్టార్స్‌, బ్రిస్బేన్‌ హీట్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాఛ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రిస్బేన్‌ హీట్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌ బ్రయాంట్‌ (77 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. 

బ్రిస్బేన్‌ ఇన్నింగ్స్‌లో బ్రయాంట్‌తో పాటు పాల్‌ వాల్టర్‌ (21), టామ్‌ బాంటన్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మెల్‌బోర్న్‌ బౌలర్లలో స్టీకిటీ రెండు వికెట్లు పడగొట్టగా.. జోయల్‌ పారిస్‌, పీటర్‌ సిడిల్‌, ఉసామా మిర్‌, డాన్‌ లారెన్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. స్టోయినిస్‌ (48 బంతుల్లో 62; 10 ఫోర్లు), డేనియల్‌ లారెన్స్‌ (38 బంతుల్లో 64 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద శతకాలు చేసి మెల్‌బోర్న్‌ను గెలిపించారు. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన మెల్‌బోర్న్‌ తొలుత తడబడింది. 

అయితే డేనియల్‌ లారెన్స్‌, స్టోయినిస్‌ బాధ్యతాయుతంగా ఆడి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. మెల్‌బోర్న్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ డకెట్‌ 0, థామస్‌ ఫ్రేజర్‌ 6, సామ్‌ హార్పర్‌ 8, ​మ్యాక్స్‌వెల్‌ డకౌటయ్యారు. బ్రిస్బేన్‌ హీట్‌ బౌలర్లలో జేవియర్‌ బార్ట్‌లెట్‌ నాలుగు వికెట్లు తీశాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement