మ్యాక్స్‌వెల్‌ ఊచకోత.. సిక్సర్ల సునామీ | Glenn Maxwell Scores 90 To Resurrect Melbourne Stars Innings Against Renegades In BBL | Sakshi
Sakshi News home page

మ్యాక్స్‌వెల్‌ ఊచకోత.. సిక్సర్ల సునామీ

Published Sun, Jan 12 2025 4:53 PM | Last Updated on Sun, Jan 12 2025 4:53 PM

Glenn Maxwell Scores 90 To Resurrect Melbourne Stars Innings Against Renegades In BBL

బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 12) జరుగుతున్న మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఉగ్రరూపం దాల్చాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (45/4) ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్‌.. 52 బంతుల్లో 10 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. 

నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మ్యాక్సీ.. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ నుంచి గేర్‌ మార్చాడు. ఆడమ్‌ జంపా వేసిన 16వ ఓవర్‌లో సిక్సర్‌, బౌండరీ బాదిన మ్యాక్స్‌వెల్‌.. కేన్‌ రిచర్డ్‌సన్‌ వేసిన ఆతర్వాతి ఓవర్‌లో మరింత రెచ్చిపోయాడు. ఈ ఓవర్‌లో అతను బౌండరీ, రెండు భారీ సిక్సర్లు బాదాడు. 

ఈ ఓవర్‌లోని తొలి సిక్సర్‌ (రెండో బంతి) బిగ్‌బాష్‌ లీగ్‌ చరిత్రలోనే అతి భారీ సిక్సర్‌గా రికార్డైంది. ఈ సిక్సర్‌ 122 మీటర్ల దూరం వెళ్లింది. మ్యాకీకి ముందు బీబీఎల్‌లో భారీ సిక్సర్‌ రికార్డు సహచరుడు హిల్టన్‌ కార్ట్‌రైట్‌ పేరిట ఉండింది. ఇదే సీజన్‌లో కార్ట్‌రైట్‌ 121 మీటర్ల సిక్సర్‌ బాదాడు.

అనంతరం సదర్‌ల్యాండ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్‌లో అతను మూడు భారీ సిక్సర్లు సహా ఓ బౌండరీ బాదాడు. ఈ ఓవర్‌లో మ్యాక్సీ వరుసగా తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. 

సెంచరీకి 10 పరుగుల దూరంలో ఉండగా మ్యాక్సీ 20వ ఓవర్‌ తొలి బంతికి ఔటయ్యాడు. కేన్‌ రిచర్డ్‌సన్‌ మ్యాక్సీని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మ్యాక్స్‌వెల్‌ పుణ్యమా అని ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్‌ చేసి 165 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌కు ఎవరి సహకారం లభించనప్పటికీ ఒక్కడే ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 

ఖాతా కూడా తెరవని ఉసామా మిర్‌తో మ్యాక్స్‌వెల్‌ ఎనిమిదో వికెట్‌కు 81 పరుగులు జోడించడం విశేషం. ఈ 81 పరుగులను మ్యాక్స్‌వెల్‌ ఒక్కడే చేశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తొలి బంతికే వికెట్‌ కోల్పోయింది. ఆతర్వాత బెన్‌ డకెట్‌ (21), బ్యూ వెబ్‌స్టర్‌ (15) కొద్దిసేపు క్రీజ్‌లో నిలబడ్డారు. 32 పరుగుల వద్ద బెన్‌ డకెట్‌, థామస్‌ రోజర్స (0) ఔటయ్యారు. 

అనంతరం 45 పరుగుల వద్ద వెబ్‌స్టర్‌, 55 పరుగుల వద్ద సోయినిస్‌ (18), 63 పరుగుల వద్ద కార్ట్‌రైట్‌ (6), 75 పరుగుల వద్ద జోయల్‌ పారిస్‌ (3) పెవిలియన్‌కు చేరారు. 11 ఓవర్లలో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఏడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు కూడా చేసేలా కనిపించలేదు. 

ఈ దశలో మ్యాక్సీ ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. రెనెగేడ్స్‌ బౌలర్లలో టామ్‌ రోజర్స్‌, ఫెర్గస్‌ ఓనీల్‌, ఆడమ్‌ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జేకబ్‌ బేతెల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచిన జకోవిచ్‌
ఈ మ్యాచ్‌ చూసేందుకు టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ వచ్చాడు. జకో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో జకో మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు మద్దతుగా నిలిచాడు. స్టార్స్‌ కెప్టెన్‌ స్టోయినిస్‌ ఔట్‌ కాగానే జకో​ నిరాశ చెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

తడబడుతున్న రెనెగేడ్స్‌
166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రెనెగేడ్స్‌ 13 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. మార్క్‌ స్టీకిటీ (3-0-14-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి రెనెగేడ్స్‌ను దెబ్బకొట్టాడు. రెనెగేడ్స్‌ ఇన్నింగ్స్‌లో జోష్‌ బ్రౌన్‌ 4, మార్కస్‌ హ్యారిస్‌ 1, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ 19, జేకబ్‌ బేతెల్‌ 1, విల్‌ సదర్‌ల్యాండ్‌ 15 పరుగులు చేసి ఔటయ్యారు. టిమ్‌ సీఫర్ట్‌ 26, హ్యారీ డిక్సన్‌ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రెనెగేడ్స్‌ గెలవాలంటే 42 బంతుల్లో 88 పరుగులు చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement