రూల్‌ ప్రకారం అతను నాటౌట్‌.. అదనంగా 5 పరుగులు కూడా | MCC Gives Verdict On Fakhar Zamans Controversial RunOut Against South Africa | Sakshi
Sakshi News home page

ఫకర్‌ జమాన్‌ రనౌట్‌ వివాదంపై ఎంసీసీ క్లారిటీ

Published Mon, Apr 5 2021 4:17 PM | Last Updated on Mon, Apr 5 2021 6:09 PM

MCC Gives Verdict On Fakhar Zamans Controversial RunOut Against South Africa - Sakshi

లండన్‌: దక్షిణఫ్రికా, పాక్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో ప్రొటీస్‌ వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించి, డబుల్‌ సెంచరీకి చేరువగానున్న పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఫకర్‌ జమాన్‌(193; 155 బంతుల్లో 18x4, 10x6) రనౌట్‌కు కారణమయ్యాడని క్రికెట్‌ లామేకర్‌ మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) పేర్కొంది. డికాక్‌ ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యపై ఫీల్డ్‌ అంపైర్లు స్పందించకపోవటాన్ని ఎంసీసీ తప్పుపట్టింది. ఎంసీసీ రూల్‌ 41.5.1 ప్రకారం ఫీల్డర్లు మాటలతో  కానీ సైగలతో కానీ బ్యాట్స్‌మెన్‌ను తప్పుదోవ పట్టించి, అతను వికెట్‌ కోల్పోవడానికి కారణమైతే ఫీల్డ్‌ అంపైర్లు జోక్యం చేసుకోవచ్చని ఎంసీసీ వివరణ ఇచ్చింది.

ఫీల్డర్ల తప్పుడు సంకేతాల వల్ల బ్యాట్స్‌మెన్‌ రనౌటైతే, దాన్ని నాటౌట్‌గా పరిగణించాలని అంతేకాకుండా బ్యాట్స్‌మెన్‌ తీసిన పరుగులకు అదనంగా 5 పరుగులు కలపాలని, తరువాతి బంతిని ఎదుర్కొనే ఛాయిస్‌ను కూడా బ్యాట్స్‌మెన్‌కే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఫకర్‌ జమాన్‌ రనౌట్‌ వివాదంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంసీసీ ఈ మేరకు స్పందించింది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించింది.  

కాగా, కెరీర్‌లో రెండో డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని  7 పరుగుల తేడాతో మిస్‌ చేసుకున్న పాక్‌ బ్యాట్స్‌మెన్‌.. రనౌట్‌ వివాదంలో డికాక్‌ తప్పేమీ లేదని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా, మ్యాచ్‌ చివరి ఓవర్‌లో డికాక్‌ ఉద్దేశపూర్వకంగా చేసిన సైగల కారణంగా ఫకర్‌ జమాన్‌ డబుల్‌ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మార్క్రమ్ వేసిన త్రో బౌలర్‌ ఎండ్‌కు వెళ్తుందని భావించిన జమాన్‌.. అటువైపు దృష్టి మళ్లించేసరికి బంతి వికెట్లను తాకడంతో అతను రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పర్యాటక​ పాక్‌ జట్టు 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 
చదవండి: ఐపీఎల్‌ ప్లేయర్స్‌కు కరోనా వ్యాక్సినేషన్‌: బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement