ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ టీ20 జట్టుకు సారధిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. మార్ష్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జార్జ్ బెయిలీ అధ్యక్షుడిగా ఉన్న సెలెక్షన్ కమిటీలో మెంబర్ కూడా అయిన మెక్ డొనాల్డ్ మార్ష్ ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ పగ్గాలు చేపట్టాలని బలంగా కోరుకుంటున్నాడు. టీ20 బాధ్యతలు వదులుకునేందుకు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఆసీస్ టీ20 జట్టు సారధిగా మార్ష్‌కు ఘనమైన రికార్డే ఉంది. మెక్ డొనాల్డ్ మార్ష్ వైపు మొగ్గు చూపేందుకు ఇది కూడా ఓ కారణంగా తెలుస్తుంది. 32 ఏళ్ల మార్ష్ ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జరిగిన తొలి సిరీస్‌లోనే ఆస్ట్రేలియాను విజయపథాన నడిపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021-23 అనంతరం సౌతాఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మార్ష్ నేతృత్వంలోని ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది.
ఆ సిరీస్‌లో మార్ష్ బ్యాటర్‌గా కూడా రాణించి (92 నాటౌట్, 79 నాటౌట్) ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో విండీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించిన మార్ష్.. ఈ సిరీస్‌లోనూ ఆసీస్‌ను విజయపథాన నడిపించాడు. ఈ సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై జరిగిన సిరీస్‌లోనూ మార్ష్ కెప్టెన్‌గా, ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించాడు. ఈ సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
మార్ష్‌కు ఉన్న ఈ ట్రాక్ రికార్డే ప్రస్తుతం అతన్ని ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ రేసులో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన మార్ష్.. తన కెరీర్‌లో 54 టీ20లు ఆడి తొమ్మిది హాఫ్ సెంచరీల సాయంతో 1432 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 17 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6న ఆడనుంది. దీనికి ముందు ఆసీస్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడటం లేదు. టీ20 వరల్డ్‌కప్ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment