
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు, ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ క్యాష్ రిచ్ లీగ్ నుంచి వైదొలిగాడు. జాతీయ జట్టు సేవలకు సిద్దమయ్యేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు బ్రూక్ తెలిపాడు. బ్రూక్‌ను గత డిసెంబర్‌లో జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. బ్రూక్ ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండోసారి.
గత సీజన్‌లోనూ బ్రూక్ ఇలాగే పొంతన లేని కారణాలు చెప్పి క్యాష్ రిచ్ లీగ్ నుంచి వైదొలిగాడు. గత సీజన్‌లో కూడా ఢిల్లీనే బ్రూక్‌ను కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో బ్రూక్ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి వైదొలిగినా, అసలు కారణాలు వేరే అని తెలిసింది. ఆ సీజన్ వేలంలో తక్కువ ధర (రూ. 4 కోట్లు) పలికినందుకు బ్రూక్ వైదొలిగాడట. 2023 సీజన్‌లో బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్ల రికార్దు ధర వెచ్చింది సొంతం చేసుకుంది. 2024 వేలంలోనూ బ్రూక్ ఇదే స్థాయి మొత్తాన్ని ఆశించగా.. నిరాశ ఎదురైంది.
కాగా, బ్రూక్ తాజా నిర్ణయంతో బీసీసీఐ అతనిపై నిషేధం విధించే అవకాశం ఉంది. బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడు సరైన కారణం లేకుండా ఐపీఎల్ నుంచి వైదొలిగితే రెండేళ్ల బ్యాన్ పడుతుంది. మరి బ్రూక్‌పై ఐపీఎల్ నిర్వహకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
బ్రూక్ ఎపిసోడ్ బయటికి వచ్చాక మరో ముగ్గురు విదేశీ స్టార్లు ఐపీఎల్-2025 నుంచి వైదొలుగుతారని ప్రచారం జరుగుతుంది. వీరిలో ఆసీస్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, ఇంగ్లండ్ సీమర్ జోఫ్రా ఆర్చర్ ఉన్నారని సమాచారం.
ఆర్చర్ జాతీయ విధుల దృష్ట్యా ఐపీఎల్‌కు డుమ్మా కొడతాడని తెలుస్తుంది. ఇంగ్లండ్ హోమ్ సమ్మర్‌కు ముందు ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయపడటంతో ఆర్చర్‌ను ఐపీఎల్ నుంచి వైదలగాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది హోం సమ్మర్‌లో ఇంగ్లండ్ టెస్ట్‌ల్లో భారత్‌ను ఢీకొట్టాల్సి ఉంది. ఆర్చర్‌ను 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది.
ఆడమ్ జంపా విషయానికొస్తే.. ఇతన్ని ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 2.4 కోట్లకు సొంతం చేసుకుంది. జంపా కూడా జాతీయ విధుల పేరుతో ఐపీఎల్‌కు డుమ్మా కొట్టనున్నాడని తెలుస్తుంది. జంపా 2024 సీజన్‌లోనూ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. గత సీజన్‌లో జంపా రాజస్థాన్ రాయల్స్‌కు ఆడాల్సి ఉండింది.
మిచెల్ స్టార్క్ విషయానికొస్తే.. గత సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్‌ను ఈ ఏడాది మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 11.75 కోట్లకు దక్కించుకుంది. 2025 సీజన్‌కు ముందు స్టార్క్ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి వైదొలుగుతాడని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఐపీఎల్ 2025 తర్వాత ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడాల్సి ఉంది. ఇదే కారణం చేత స్టార్క్ తదితర ఆసీస్ టెస్ట్ జట్టు సభ్యులు ఐపీఎల్ నుంచి వైదొలుగుతారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment