
Mithali Raj Becomes First Indian Woman Cricketer To Receive Khel Ratna Award: భారత మహిళా క్రికెట్ జట్టు టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించనుంది. క్రీడల్లో భారత దేశపు అత్యున్నత పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు అందుకోనున్న మొదటి మహిళా క్రికెటర్‌గా నిలువనుంది. గతంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు పురుష క్రికెటర్లను మాత్రమే వరించింది. 1998లో సచిన్ టెండూల్కర్, 2008లో ఎంఎస్ ధోని, 2018లో విరాట్ కోహ్లి, 2020లో రోహిత్ శర్మ ఈ అవార్డును అందుకున్నారు.
కాగా, 22 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్ కలిగిన 38 ఏళ్ల మిథాలీ.. 10 వేలకు పైగా పరుగులతో పాటు మరెన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకూ ఆమె 12 టెస్టులు, 220 వన్డేలు, 89 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఇదిలా ఉంటే, ఈ అవార్డుకు మిథాలీతో పాటు టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ సహా మొత్తం 11 మంది క్రీడాకారులకు నామినేట్ అయ్యారు. వీరితో పాటు మరో 34 మంది ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తదితరులు ఉన్నారు.
చదవండి: నీరజ్ చోప్రా, లవ్లీనా, మిథాలీ రాజ్, పీఆర్ రాజేశ్... ఈసారి వీళ్లంతా..