రాజ్‌కోట్: దేశవాళీ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో తమకు ఎదురులేదని ఇండియన్ రైల్వేస్ జట్టు మరోసారి నిరూపించుకుంది. ఆదివారం ముగిసిన బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో మిథాలీ రాజ్ నాయకత్వంలోని రైల్వేస్ జట్టు 12వసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన రైల్వేస్ అన్నింట్లోనూ గెలిచి అజేయంగా నిలువడం విశేషం. ఇప్పటి వరకు ఈ టోర్నీ 14 సార్లు జరగ్గా... 12 సార్లు రైల్వేస్, ఒక్కోసారి ఢిల్లీ, బెంగాల్ జట్లు విజేతగా నిలిచాయి. జార్ఖండ్‌తో జరిగిన ఫైనల్లో రైల్వేస్ ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన జార్ఖండ్ సరిగ్గా 50 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. ఇంద్రాణి రాయ్ (49; 3 ఫోర్లు), మణి నిహారిక (39 నాటౌట్; 4 ఫోర్లు), దుర్గా ముర్ము (31; 3 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. రైల్వేస్ బౌలర్లలో స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టగా, మేఘన సింగ్, ఏక్తా బిష్త్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. అనంతరం రైల్వేస్ 37 ఓవర్లలో మూడు వికెట్లకు 169 పరుగులు చేసి గెలిచింది. రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (53; 6 ఫోర్లు), పూనమ్ రౌత్ (59; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. స్నేహ్ రాణా (22 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడింది. జార్ఖండ్ బౌలర్లలో దేవయాని రెండు వికెట్లు తీసింది.
Comments
Please login to add a commentAdd a comment