పాక్ మాజీ క్రికెట‌ర్‌కు బంప‌రాఫ‌ర్‌.. ఐపీఎల్‌కు అర్హత! | Mohammad Amir Becomes Eligible To Play IPL British Citizenship | Sakshi
Sakshi News home page

పాక్ మాజీ క్రికెట‌ర్‌కు బంప‌రాఫ‌ర్‌.. ఐపీఎల్‌కు అర్హత!

May 20 2026 6:35 PM | Updated on May 20 2026 7:44 PM

Mohammad Amir Becomes Eligible To Play IPL British Citizenship

ముంబై ఉగ్ర‌దాడులు (2008) త‌ర్వాత భార‌త్‌, పాకిస్తాన్‌ల మ‌ధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు నిలిచిపోయాయి. ఐసీసీ, ఆసియాక‌ప్ వంటి మేజ‌ర్ టోర్నీల్లో మాత్ర‌మే ఇరుజ‌ట్లు ముఖాముఖి త‌ల‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ఆడేందుకు పాక్ ఆట‌గాళ్ల‌కు అనుమ‌తి లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాక్‌ మాజీలకు కూడా అవకాశం లేదు.

అయితే పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ మహ్మద్ ఆమిర్‌కు మాత్రం ఐపీఎల్‌లో ఆడేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించే అవ‌కాశ‌ముంది. ఇటీవ‌లే మ‌హ్మ‌ద్ ఆమిర్ బ్రిటీష్ పౌర‌స‌త్వాన్ని పొందడంతో అధికారికంగా బ్రిట‌న్ జాతీయ‌త‌ను క‌లిగి ఉన్నాడు. దీనివ‌ల్ల ఆమిర్ పాకిస్తాన్‌లో జ‌న్మించి న‌ప్ప‌టికీ తాజాగా బ్రిటీష్ పౌర‌స‌త్వాన్ని పొంద‌డంతో ఐపీఎల్లో ఆడేందుకు అర్హ‌త సాధించాడు. 

2008 ముంబై ఉగ్ర‌దాడుల త‌ర్వాత బీసీసీఐతో పాటు భార‌త ప్ర‌భుత్వం పాకిస్తాన్ పాస్‌పోర్టులు క‌లిగిన క్రికెట‌ర్ల‌ను ఐపీఎల్‌లో పాల్గొన‌కుండా నిషేధం విధించింది. అయితే బ్రిటీష్ పాస్‌పోర్టు అందుకున్న త‌ర్వాత బ్రిట‌న్‌కు చెందిన ‘ది హండ్రెడ్’ టోర్నీలో ఆమిర్ పాల్గొన్నాడు. 

ఐపీఎల్ నిబంధ‌న‌ల ప్ర‌కారం అంత‌ర్జాతీయ ఆట‌గాళ్లు వేలంలో పాల్గొనాల‌నుకుంటే త‌మ పాస్‌పోర్టు ప‌త్రాల‌ను సమ‌ర్పించాల్సి ఉంటుంది. బౌగోళిక ఆంక్ష‌ల నేప‌థ్యంలో కేవ‌లం పాకిస్తాన్‌లో జ‌న్మించిన ఆట‌గాళ్ల‌ను మాత్ర‌మే తీసుకోకూడ‌ద‌నే నిబంధ‌న ఐపీఎల్లో ఉంది. మ‌హ్మ‌ద్ పాకిస్తాన్ దేశానికి చెందిన వాడైన‌ప్ప‌టికీ త‌న వ‌ద్ద యూకే పాస్‌పోర్ట్ ఉన్నందున‌, బ్రిటీష్ పౌరుడిగా వేలంలో పేరు న‌మోదు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఆమిర్‌కు అవ‌కాశ‌మెంత‌?
అయితే గ‌తంలో పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ అజ‌ర్ మ‌హ్మూద్ బ్రిట‌న్ మ‌హిళ‌ను పెళ్లి చేసుకొని ఆ దేశ పౌర‌స‌త్వాన్ని పొందాడు. ఆ త‌ర్వాత యూకే పౌర‌సత్వంతో ఐపీఎల్ వేలంలో పేరు న‌మోదు చేసుకోవ‌డ‌మే గాక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌, కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 

అయితే టీ20 క్రికెట్‌లో స్టార్ క్రికెట‌ర్‌గా గుర్తింపు పొందిన మ‌హ్మ‌ద్ ఆమిర్ ఐపీఎల్ 2027 సీజ‌న్‌లో ఆడుతాడా లేదా అన్న‌ది ప్ర‌శ్న‌గానే ఉంది. ఇటీవ‌లే ది హండ్రెడ్‌, ఎస్ఏ20 టోర్నీల్లో పాక్‌లో జ‌న్మించిన ఆట‌గాళ్ల‌ను చేర్చ‌డంపై వివాదం చెల‌రేగింది. దీంతో మ‌హ్మ‌ద్ ఆమిర్ ఐపీఎల్‌లో ఆడుతాడా అన్న‌ది అనుమాన‌మే. అయితే ఆమిర్‌కు ఇంగ్లండ్ దేశం హోదా కింద ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం పూల్‌లో త‌న పేరును రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. 

అత‌డు డ్రాఫ్ట్ చేయ‌డానికి అర్హుడైన‌ప్ప‌టికీ, వేలంలో ఫ్రాంచైజీలు అత‌డిని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపిస్తాయా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. అయితే ఐపీఎల్‌లో ఆడేందుకు అధికారికంగా ఆమిర్‌కు అర్హ‌త ఉన్న‌ప్ప‌టికీ బీసీసీఐ మాత్రం సున్నిత‌త్వ అంశానికే ప్రాధాన్యం ఇస్తే మాత్రం అత‌డు వేలంలో పేరు న‌మోదు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉండ‌దు. 

ముఖ్యంగా ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత ఐపీఎల్‌లో పాల్గొనే ఆట‌గాళ్ల‌పై క‌ఠిన ఆంక్ష‌ల‌ను జారీ చేసింది. ఈ లెక్కన మ‌హ్మ‌ద్ ఆమిర్ ఐపీఎల్ ఎంట్రీ జ‌ర‌గ‌డం అనుమాన‌మే.

స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం
స్వ‌త‌హగా ఫాస్ట్‌ బౌల‌ర్ అయిన మ‌హ్మ‌ద్ ఆమిర్ త‌న స్వింగ్‌తో ప్ర‌త్యర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాడు. అయితే 2010లో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం మ‌హ్మ‌ద్ ఆమిర్ కెరీర్‌లో మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలిపోయింది. చాలాకాలం పాటు అత‌డిపై నిషేధం కొన‌సాగింది. 2015లో ఐసీసీ అత‌డిపై నిషేధం తొల‌గించిన త‌ర్వాత జాతీయ జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.  

ఇక 2009లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన మహ్మద్ ఆమిర్ పాక్ తరఫున 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 62 టీ20ల్లో 71 వికెట్లు పడగొట్టాడు. 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు ఆమిర్‌ వీడ్కోలు పలికాడు.

అయితే గ‌తేడాది ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌ త‌ర్వాత భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. గ‌తేడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు బంగ్లాదేశ్ భార‌త్‌లో ఆడేందుకు నిరాక‌రించిన స‌మ‌యంలో పాకిస్తాన్ హైడ్రామా చేసిన సంగ‌తి కూడా ఎవ‌రు మ‌రిచిపోలేరు. 

చదవండి: 'క‌శ్మీరీ అని చుల‌క‌న‌.. అందుకే ఎంపిక చేయ‌లేదా?'

Advertisement
 
Advertisement
Advertisement