ఐపీఎల్-2023లో భాగంగా వాంఖడే స్టేడియం వేదిగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో 27 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో గుజరాత్‌కు భారీ ఓటమి తప్పదని అంతా భావించారు.
కానీ ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ అందరి అంచనాలను తలకిందులు చేశాడు. 8 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రషీద్ ఖాన్ ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 32 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రషీద్ 3 ఫోర్లు, 10 సిక్సర్లతో 79 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
అంతకుముందు ముంబై ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 103 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. కాగా సూర్యకు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. ఈ మ్యాచ్‌పై భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ కంటే రషీద్‌ను అత్యంత విలువైన ఆటగాడిగా(మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్) చోప్రా ఎంచుకున్నాడు. టైటాన్స్ టాప్-ఆర్డర్ బ్యాటర్లు రాణించే ఉంటే రషీద్ కచ్చితంగా తన జట్టును గెలిపించేవాడు అని ఆకాష్ చోప్రా తెలిపాడు.
"నా వరకు అయితే ఈ మ్యాచ్‌లో అత్యంత విలువైన ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కాదు. మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్ రషీద్ ఖాన్. టాపర్డర్ బ్యాటర్లు కాస్త రాణించే ఉంటే, రషీద్ ఖాన్ ఒంటరిగా మ్యాచ్‌ను గెలిపించేవాడు. గుజరాత్ ఐదు వికెట్లు సాధిస్తే.. అందులో రషీద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అందుతో ఓపెనర్లతో పాటు నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్ వికెట్లు కూడా ఉన్నాయి" అని తన యూట్యూబ్ ఛానల్‌లో చోప్రా చెప్పుకొచ్చాడు.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. సూర్య కోసం మా ప్లాన్ ఛేంజ్ చేశాం: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment