షాకింగ్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్‌బై | MS Dhoni Retired From International Cricket | Sakshi
Sakshi News home page

షాకింగ్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్‌బై

Published Sat, Aug 15 2020 8:09 PM | Last Updated on Mon, Aug 17 2020 5:49 PM

MS Dhoni Retired From International Cricket - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు ధోని శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించాడు. ఇన్నేళ్లు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. ధోని సారథ్యంలో టీమిండియా వన్డే, టీ-20 ప్రపంచకప్‌, ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి సాధించింది. గతంలోనే టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలిగిన ధోని, టీ-20 వన్డే, జట్లలో ఆటగాడిగా కొనసాగాడు. ధోని అనూహ్య నిర్ణయంతో యావత్‌ క్రీడా లోకం ఆశ్చర్యంలో మునిగింది. ఇక ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని ప్రస్తుతం జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్‌ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే.
(అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా గుడ్‌బై)

టీమిండియాకు ఎనలేని కృషి
39 ఏళ్ల మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో పలు సంచలన రికార్డులు నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో టీమిండియాను నెంబర్‌ 1 స్థానానికి చేర్చడంలో రాంచీ డైనమెట్‌ కీలక పాత్ర పోషించాడు. బ్యాట్స్‌మెన్‌, వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌గా ధోనీ టీమిండియాకు ఎనలేని కృషి చేశాడు. 2004, డిసెంబర్‌ 23న బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్‌లో టీమిండియా జట్టులోకి ధోని అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో ధోని పరుగులేమీ చేయకుండా రనౌట్‌ కావడం విశేషం.

ఇక 2005లో శ్రీలంకతో మ్యాచ్‌లో ధోని తొలి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2006లో తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. 2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ధోని చివరి సారిగా 2019, జులై 19న  ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోని 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధశతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్‌ చేశాడు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌. ఇక 98 టీ 20 మ్యాచ్‌లలో 1600 పరుగుల సాధించాడు. 
(ఎక్కడైనా ధోనియే నెంబర్‌ వన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement