డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతోంది...ప్లే ఆఫ్స్ స్థానం ఖరారైన తర్వాత కూడా ఏమాత్రం తీవ్రత తగ్గించని ఆ జట్టు ఢిల్లీని సునాయాసంగా ఓడించి తమ స్థాయిని ప్రదర్శించింది. భారీ రన్‌రేట్ కారణంగా ఆ జట్టు టాప్–2లో నిలవడం కూడా దాదాపుగా ఖాయమైంది. మరో వైపు పేలవ ప్రదర్శనతో క్యాపిటల్స్ మరింత దిగజారింది. బ్యాటింగ్ వైఫల్యంతో వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిన ఆ టీమ్ రన్‌రేట్ కూడా మైనస్‌లోకి పడిపోయింది. ముందంజ వేసే అవకాశాలు ఇంకా ఉన్నా... పరిస్థితిని మాత్రం క్లిష్టంగా మార్చుకుంది.
దుబాయ్: ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో పెద్ద విజయం చేరింది. పేస్ ద్వయం బుమ్రా (3/17), బౌల్ట్ (3/21) అద్భుత ప్రదర్శన చేయడంతో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను 9 వికెట్లతో ముంబై చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్)దే అత్యధిక స్కోరు. అనంతరం 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (47 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు.
ధావన్ మళ్లీ సున్నా...
భారీ స్కోరు సాధించాలనే లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ ధాటికి వరుసగా రెండో మ్యాచ్‌లోనూ శిఖర్ ధావన్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు. కాసేపటికే రెండు ఫోర్లతో జోరు కనబరిచిన పృథ్వీ (10) కూడా పెవిలియన్ చేరాడు. పరుగులు చేసేందుకు శ్రమించిన ఢిల్లీ పవర్‌ప్లేలో కేవలం 22 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో నమోదైన రెండో అత్యల్ప స్కోరు ఇదే. పంత్ (24 బంతుల్లో 21; 2 ఫోర్లు)తో కలిసి అయ్యర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే 12 పరుగుల వ్యవధిలో అయ్యర్, స్టొయినిస్ (2), పంత్ వికెట్లను కోల్పోయి 62/5తో కష్టాల్లో పడింది. మరోసారి చెలరేగిన బుమ్రా... హర్షల్‌పటేల్ (5)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, హెట్‌మైర్ (11) విఫలమయ్యాడు.
ఇషాన్ కిషన్ తడాఖా...
భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై స్వల్ప లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది. ఇషాన్ కిషన్ నాలుగు బౌండరీలతో రాణించడంతో వికెట్ కోల్పోకుండా పవర్‌ప్లేలో 41 పరుగులు సాధించింది. ఇషాన్‌కు సహకరించిన డికాక్ (28 బంతుల్లో 26; 2 ఫోర్లు)... నోర్జే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం సూర్యకుమార్ (12) అండతో ఇషాన్ 37 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింత చెలరేగిన ఇషాన్ సిక్సర్‌తో మరో 34 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) డికాక్ (బి) బౌల్ట్ 10; ధావన్ (సి) సూర్యకుమార్ (బి) బౌల్ట్ 0; శ్రేయస్ (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చహర్ 25; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 21; స్టొయినిస్ (సి) డికాక్ (బి) బుమ్రా 2; హెట్‌మైర్ (సి) కృనాల్ (బి) కూల్టర్ నీల్ 11; హర్షల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 5; అశ్విన్ (సి) కృనాల్ (బి) బౌల్ట్ 12; ప్రవీణ్ దూబే (నాటౌట్) 7; రబడ (రనౌట్) 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 110.
వికెట్ల పతనం: 1–1, 2–15, 3–50, 4–57, 5–62, 6–73, 7–78, 8–96, 9–110.
బౌలింగ్: బౌల్ట్ 4–0–21–3, కృనాల్ 3–0–13–0, జయంత్ యాదవ్ 3–0–18–0, బుమ్రా 4–0–17–3, కూల్టర్‌నీల్ 2–0–14–1, రాహుల్ చహర్ 4–0–24–1.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (నాటౌట్) 72; డికాక్ (బి) నోర్జే 26; సూర్యకుమార్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 111.
వికెట్ల పతనం: 1–68.
బౌలింగ్: రవిచంద్రన్ అశ్విన్ 4–0–18–0, రబడ 3–0–27–0, నోర్జే 2.2–0–25–1, స్టొయినిస్ 1–0–4–0, ప్రవీణ్ 3–0–29–0, హర్షల్ పటేల్ 1–0–8–0.
ఢిల్లీ మళ్లీ మళ్లీ...
Published Sun, Nov 1 2020 5:41 AM | Last Updated on Sun, Nov 1 2020 8:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment