ఏడు సీజన్‌ల తర్వాత ‘తొలి’ ఓటమి | Mumbai Indians Beat KKR By 49 Runs | Sakshi
Sakshi News home page

ఏడు సీజన్‌ల తర్వాత ‘తొలి’ ఓటమి

Published Wed, Sep 23 2020 11:44 PM | Last Updated on Wed, Sep 23 2020 11:49 PM

Mumbai Indians Beat KKR By 49 Runs - Sakshi

అబుదాబి: ఐపీఎల్‌-13లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయం సాధించి ఖాతా తెరిచింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ముంబై.. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్‌ 49 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది.ముంబై నిర్దేశించిన 196 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కేకేఆర్‌ 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు శుభారంభం లభించలేదు. శుబ్‌మన్‌ గిల్‌(7), సునీల్‌ నరైన్‌(9)లు ఆదిలోనే పెవిలియన్‌ చేరడంతో కేకేఆర్‌ కష్టాల్లో పడింది.  ఆపై కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(30), నితీష్‌ రాణా(24)లు 46 పరుగులు భాగస్వామ్యాన్ని సాధించారు. కేకేఆర్‌ 71 పరుగుల వద్ద ఉండగా కార్తీక్‌ ఔటవ్వగా మరో ఆరు పరుగుల వ్యవధిలో రాణా కూడా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ఇయాన్‌ మోర్గాన్‌, రసెల్‌ల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. రసెల్‌(11), మోర్గాన్‌(16)లు విఫలం కాగా, చివర్లో కమిన్స్‌(33) మెరిశాడు. టాపార్డర్‌లో ఎవరూ భారీ స్కోర్లు సాధించకపోవడంతో కేకేఆర్‌ ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో బుమ్రా ,ట్రెంట్‌ బౌల్ట్‌, పాటిన్‌సన్‌, రాహుల్‌ చహర్‌ తలో రెండు వికెట్లు సాధించారు.కీరోన్‌ పొలార్డ్‌కు వికెట్‌ దక్కింది.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్‌ తగలింది. శివం మావి వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికి డీకాక్‌(1) పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో రోహిత్‌ శర్మ-సూర్యకుమార్‌ యాదవ్‌లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. క్రీజ్‌లో వచ్చిన దగ్గర్నుంచీ సూర్యకుమార్‌ యాదవ్‌ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అటు తర్వాత రోహిత్‌ కూడా చెలరేగాడు. దాంతో రెండో వికెట్‌కు 90 పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జట్టు స్కోరు 10.2 ఓవర్లలో 98 పరుగులకు చేరగానే సూర్యకుమార్‌ యాదవ్‌ 47 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సౌరబ్‌ తివారి 13 బంతుల్లో 21 పరుగులు చేసి ఇన్నింగ్స్‌లో తన వంతు పాత్ర పోషించాడు.  రోహిత్‌ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. రోహిత్‌ ఇన్నింగ్స్‌లో 3ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 


ఏడు సీజన్‌ల తర్వాత ‘తొలి’ ఓటమి..
ఈ మ్యాచ్‌లో ఓటమితో కేకేఆర్‌ చెత్త రికార్డును లిఖించుకుంది. 2013 నుంచి 2019 వరకూ కేకేఆర్‌ ఎప్పుడూ తన ఆరంభపు మ్యాచ్‌లో ఓడిపోలేదు. అయితే తాజా సీజన్‌ కేకేఆర్‌ తన ఓపెనింగ్‌ మ్యాచ్‌లోనే ఓటమి పాలై రికార్డును సవరించుకుంది. 2013లో కేకేఆర్‌ తన ఆరంభపు మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించగా, 2014లో ముంబై ఇండియన్స్‌పై 41 పరుగుల తేడాతో గెలిచింది. ఇక 2015లో ముంబై ఇండియన్స్‌పైనే ఓపెనింగ్‌ మ్యాచ్‌ ఆడిన కేకేఆర్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించగా, 2017లో గుజరాత్‌ లయన్స్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచింది. 2018లో ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో, 2019లో సన్‌రైజ‍ర్స్‌ హైదరాబాద్‌పై ఆరు వికెట్లతో గెలుపును అందుకుంది. కాగా, ఈ సీజన్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో గత రికార్డును కేకేఆర్‌ కొనసాగించడంలో విఫలమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement