ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ కోల్పోతే.. | DC Lose Rahane Early In Tall Chase | Sakshi
Sakshi News home page

ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ కోల్పోతే..

Published Sat, Oct 24 2020 5:46 PM | Last Updated on Sat, Oct 24 2020 6:24 PM

DC Lose Rahane Early In Tall Chase - Sakshi

తొలి బంతికే వికెట్‌ తీసిన ఆనందలో కేకేఆర్‌ సభ్యులు(ఫోటో కర్టసీ; ట్విట్టర్‌)

అబుదాబి: క్రికెట్‌లో తొలి బంతికే వికెట్‌ కోల్పోతే ఆ జట్టు ఒత్తిడిలో పడటం ఖాయం. ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరుగుతున్న మ్యాచ్‌లో లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి బంతికే వికెట్‌ను కోల్పోయింది. కేకేఆర్‌ నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను అజింక్యా రహానే, శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. స్టైకింగ్‌ను రహానే తీసుకోగా, కమిన్స్‌ తొలి ఓవర్‌ను అందుకున్నాడు. కమిన్స్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి బంతికే రహానే వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ అయ్యాడు. స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండానే ఢిల్లీ వికెట్‌ను ఖాతాలో వేసుకోవడంతో కేకేఆర్‌ శిబిరంలో విపరీతమైన జోష్‌ను తెచ్చింది. ఇక మళ్లీ కమిన్స్‌ వేసిన మూడో ఓవర్‌ మూడో బంతికి మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(6) ఔటయ్యాడు. కమిన్స్‌ వేసిన బంతికి ధావన్‌ బౌల్డ్‌ అయ్యాడుదాంతో ఢిల్లీ 13 పరుగులకే రెండు కీలక వికెట్లను చేజార్చుకుంది. భారీ పరుగుల ఛేదనలో తొలి బంతికే వికెట్‌ కోల్పోవడమే కాకుండా స్వల్ప వ్యవధిలోనే మరో వికెట్‌ కోల్పోవడంతో ఢిల్లీ ఒత్తిడిలో పడింది.(ధోని చెప్పింది నిజమే కదా.. ఇప్పుడేమంటారు!)

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. నితీష్‌ రాణా(81; 53 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌), నరైన్‌(64; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో కేకేఆర్‌ భారీ స్కోరు చేసింది. టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫీల్డింగ్‌ తీసుకోవడంతో కేకేఆర్‌ బ్యాటింగ్‌కు దిగింది. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణాలు ఆరంభించారు. అయితే నోర్జే వేసిన రెండో ఓవర్‌ ఐదో బంతికి గిల్‌(9; 8 బంతుల్లో 2 ఫోర్లు) ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ క్యాచ్‌ పట్టడంతో గిల్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. కాసేపటికి ఫస్ట్‌డౌన్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠి(13; 12 బంతుల్లో 1ఫోర్‌)ను కూడా నోర్జే ఔట్‌ చేశాడు. సుమారు 150 కి.మీ వేగంతో మిడిల్‌ స్టంప్‌ను టార్గెట్‌ చేస్తూ వేసిన బంతికి త్రిపాఠి వద్ద సమాధానం లేకుండా పోయింది. దాంతో 35 పరుగులకే కేకేఆర్‌ రెండో వికెట్‌ను నష్టపోయింది. 

మరో ఏడు పరుగుల వ్యవధిలో దినేశ్‌ కార్తీక్‌(3) నిరాశపరిచాడు. రబడా వేసిన ఎనిమిదో ఓవర్‌ రెండో బంతికి పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి కార్తీక్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో ఓపెనర్‌ రాణాకు సునీల్‌ నరైన్‌ జత కలిశాడు. ఈ జోడి క్రీజ్‌లో కుదురుకున్నాక కేకేఆర్‌ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. నువ్వా-నేనా అన్నట్లు వీరు బ్యాటింగ్‌ కొనసాగించారు. వీరు మెరుపులతో కేకేఆర్‌ 15 ఓవర్లలో 142 పరుగులు చేసింది.  కాగా, నరైన్‌ 32 బంతుల్లో  6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు చేసి కేకేఆర్‌ విలువైన పరుగుల్ని అందించాడు. రాణాతో కలిసి 115 పరుగుల భాగస్వామ్యం జత చేసిన తర్వాత నరైన్‌ నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రబడా వేసిన 17 ఓవర్‌ నాల్గో బంతికి భారీ షాట్‌ ఆడబోయి క్యాచ్‌ ఔటయ్యాడు. ఆ తరువాత రాణా-మోర్గాన్‌ ద్వయం చెలరేగి ఆడింది. మోర్గాన్‌ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో  17 పరుగులు చేశాడు. స్టోయినిస్‌ వేసిన ఆఖరి ఓవర్‌ చివరి రెండు బంతులకు రాణా, మోర్గాన్‌లు ఔట్‌ కావడంతో రెండొందల పరుగుల మార్కును కేకేఆర్‌ చేరలేకపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement