కెప్టెన్సీకి దినేశ్‌ కార్తీక్‌ గుడ్‌ బై | Dinesh Karthik Hands Over KKR Captaincy To Morgan | Sakshi
Sakshi News home page

కెప్టెన్సీకి దినేశ్‌ కార్తీక్‌ గుడ్‌ బై

Published Fri, Oct 16 2020 3:32 PM | Last Updated on Fri, Oct 16 2020 10:27 PM

Dinesh Karthik Hands Over KKR Captaincy To Morgan - Sakshi

అబుదాబి: ఐపీఎల్‌లో తన కెప్టెన్సీపై వస్తున్న విమర్శలకు దినేశ్‌ కార్తీక్‌ ముగింపు పలికాడు. తాను కేకేఆర్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించాడు.   ఈ మేరకు శుక్రవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. బ్యాటింగ్‌పై ఫోక‌స్ పెట్టాల‌న్న దృష్టితో సార‌థ్యాన్ని వ‌ద‌లుచుకుంటున్న‌ట్లు దినేశ్ వెల్ల‌డించాడు. ఇక నుంచి ఆ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇంగ్లండ్ క్రికెట‌ర్ ఇయాన్ మోర్గన్ చూసుకోనున్నాడు. ఈ సీజన్ ఆరంభంలో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు, నరైన్‌కు ఓపెనర్‌గా పదే పదే అవకాశాలు ఇవ్వడం.. తన బ్యాటింగ్ ప్రదర్శన సరిగా లేకపోవడంతో.. ఫ్యాన్స్ కార్తీక్‌ను కెప్టెన్సీ వదులుకోవాలని డిమాండ్ చేశారు.(అంతా ధోని వల్లే..: ఆర్సీబీ బౌలర్‌)

ఇంగ్లండ్‌కు వరల్డ్‌ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్‌ను జట్టులో ఉంచుకొని కార్తీక్‌కు కెప్టెన్సీ ఎందుకని ప్రశ్నించారు. కానీ మేనేజ్‌మెంట్ మాత్రం కార్తీక్‌పైనే నమ్మకం ఉంచింది. కోల్‌కతా విజయాల బాట పట్టాక.. కీలకమైన ప్లేఆఫ్స్ దశకు ముందు దినేశ్ కార్తీక్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. రెండన్నేళ్లుగా కేకేఆర్‌కు దినేశ్‌ కార్తీక్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. దినేశ్ కార్తీక్ నిర్ణయం పట్ల కోల్‌కతా నైట్ రైడర్స్ సీఈవో వెంకీ మైసూరు స్పందించారు. దినేశ్‌ కార్తీక్‌ లాంటి నాయకుడు తమ జట్టులో ఉండటం అదృష్టమన్నారు. తనకు తానే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎంతో ధైర్యం అవసరమన్నారు. దినేశ్ కార్తీక్ నిర్ణయంతో ఆశ్చర్యానికి గురయ్యామని.. కానీ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. ఇవాళ ముంబై ఇండియ‌న్స్‌తో కేకేఆర్‌ తలపడనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన ఫస్ట్‌ లెగ్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 49 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement