చెలరేగిన ‘హిట్‌మ్యాన్‌’ | Mumbai Indians beat Kolkata Knight Riders by 49 runs | Sakshi
Sakshi News home page

ముంబై రోహిట్‌...

Published Thu, Sep 24 2020 5:10 AM | Last Updated on Thu, Sep 24 2020 8:36 AM

Mumbai Indians beat Kolkata Knight Riders by 49 runs - Sakshi

కోల్‌కతాపై గెలిచిన ముంబై లీగ్‌లో ఖాతా తెరిచింది.  తమ రెండో మ్యాచ్‌లో ఇటు బ్యాట్‌తో... అటు బంతితో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భరతం పట్టిన ముంబై ఇండియన్స్‌ విజయం సాధించింది. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ చెలరేగాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కెప్టెన్‌ వీరవిహారంతో ముంబై జట్టు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది.  

అబుదాబి: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మురిసింది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో గెలుపు రుచి చూసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 49 పరుగుల తేడాతో మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జయభేరి మోగించింది. ఈ పోరులో ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అలరించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.  ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 80; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్యకుమార్‌ (28 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిశారు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడింది. టెయిలెండర్‌ కమిన్స్‌ (12 బంతుల్లో 33; 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.   

సూర్యకుమార్‌ జోరు...
రెండో ఓవర్లోనే డికాక్‌ (1) ఔటైనా... కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు జతయిన సూర్యకుమార్‌ యాదవ్‌ ధాటిగా ఆడాడు. సందీప్‌ వేసిన మూడో ఓవర్లో 4 బౌండరీలు బాదాడు. దీంతో స్కోరులో ఉన్నపళంగా వేగం పెరిగింది. కోల్‌కతా సారథి దినేశ్‌ కార్తీక్‌... ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఖరీదైన బౌలర్‌ కమిన్స్‌ను రంగంలోకి దించిన ప్రయోజనం లేకపోయింది. అనుభవజ్ఞుడైన హిట్‌మ్యాన్‌ రెండు సిక్సర్లతో కమిన్స్‌ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. స్పిన్నర్‌ నరైన్‌కు బంతినప్పగిస్తే సూర్యకుమార్‌ ఫోర్లతో స్వాగతం పలికాడు. దీంతో ముంబై పవర్‌ ప్లేలో 59/1 స్కోరు చేసింది. దీంతో ఓవర్‌ ఓవర్‌కూ బౌలర్లను మార్చినా... ముంబై స్కోరు, జోరు పెరిగిందే తప్ప తగ్గలేదు. అయితే ఏ బౌలర్‌కు లొంగని ఈ జోడీని రనౌట్‌ విడగొట్టింది. జట్టు స్కోరు 98 పరుగుల వద్ద సూర్యకుమార్‌ రనౌటయ్యాడు. దీంతో 90 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది.

రోహిత్‌ ఫిఫ్టీ...
తర్వాత క్రీజ్‌లోకి సౌరభ్‌ తివారీ రాగా... ‘హిట్‌మ్యాన్‌’ 39 బంతుల్లో (1 ఫోర్, 4 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. స్పిన్నర్లను అవలీలగా ఎదుర్కొన్న రోహిట్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కుల్దీప్‌ వేసిన 14వ ఓవర్లో మిడ్‌ వికెట్, లాంగాన్‌ల మీదుగా రెండు సిక్సర్లు బాదాడు. మరోవైపు ఖరీదైన బౌలర్‌ కమిన్స్‌కు రెండో స్పెల్‌లోనూ నిరాశ తప్పలేదు. ఈసారి తివారీ అతన్ని ఆడుకున్నాడు. వరుసగా 4, 6 కొట్టాడు. దీంతో ఈ ఓవర్లోనూ 15 పరుగులు సమర్పించుకున్నాడు. అలా 2 ఓవర్లలోనే అతను 30 పరుగులు ఇచ్చుకున్నాడు. మూడో వికెట్‌కు 49 పరుగులు జోడించాక తివారీ (13 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్‌)ని నరైన్‌ ఔట్‌ చేశాడు. తన మూడో ఓవర్‌ (ఇన్నింగ్స్‌ 17వ)లోనూ కమిన్స్‌కు నిరాశ తప్పలేదు. హార్దిక్‌ పాండ్యా 2 బౌండరీలు, భారీ సిక్సర్‌తో 17 పరుగులు పిండుకున్నాడు. ఆఖరి ఓవర్లలో పొలార్డ్‌ (13 నాటౌట్‌) లాంటి హిట్టర్‌ ఉన్నా... ముంబైకి ఆశించినన్ని పరుగులు రాలేదు.

ఆరంభం నుంచే కష్టాలు...
ముంబై నిర్దేశించిన లక్ష్యం 196. అంటే కోల్‌కతా సుమారు ఓవర్‌కు పది పరుగులు చొప్పున 20 ఓవర్లు ఆడితేనే ఛేదిస్తుంది. కానీ ఓపెనింగ్‌ వైఫల్యం, బాధ్యతలేని మిడిలార్డర్‌ వల్ల లక్ష్యానికి సరిపడ పరుగులు ఏ ఓవర్లోనూ చేయలేకపోయింది. శుబ్‌మన్‌ (7), నరైన్‌ (9) ఆరంభంలోనే ఔటయ్యారు. 25 పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన నైట్‌రైడర్స్‌ను కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (30; 5 ఫోర్లు), నితీశ్‌ రాణా (24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కాసేపు నడిపించారు. కానీ గెలిపించే భాగస్వామ్యమైతే నమోదు చేయలేదు. పడుతూలేస్తూ జట్టు స్కోరు వందకు చేరగానే ‘హిట్టర్‌’ రసెల్‌ (11), స్టార్‌ బ్యాట్స్‌మన్‌ మోర్గాన్‌ (16)లను బుమ్రా ఒకే ఓవర్లో పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత వచ్చిన వారిలో కమిన్స్‌ బుమ్రా బౌలింగ్‌లో నాలుగు సిక్సరల్తో మెరుపులు మెరిపించాడు. కానీ కొండంత లక్ష్యానికి అవే మాత్రం సరిపోలేదు.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) నిఖిల్‌ (బి) శివమ్‌ మావి 1; రోహిత్‌ శర్మ (సి) కమిన్స్‌ (బి) శివమ్‌ మావి 80; సూర్యకుమార్‌ (రనౌట్‌) 47; సౌరభ్‌ తివారీ (సి) కమిన్స్‌ (బి) నరైన్‌ 21; హార్దిక్‌ పాండ్యా (హిట్‌ వికెట్‌) (బి) రసెల్‌ 18; పొలార్డ్‌ (నాటౌట్‌) 13; కృనాల్‌ పాండ్యా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 195.

వికెట్ల పతనం: 1–8, 2–98, 3–147, 4–177, 5–180.    

బౌలింగ్‌: సందీప్‌ వారియర్‌ 3–0–34–0, శివమ్‌ మావి 4–1–32–2, కమిన్స్‌ 3–0–49–0, నరైన్‌ 4–0–22–1, రసెల్‌ 2–0–17–1, కుల్దీప్‌ యాదవ్‌ 4–0–39–0.  

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: శుబ్‌మన్‌ గిల్‌ (సి) పొలార్డ్‌ (బి) బౌల్ట్‌ 7; నరైన్‌ (సి) డికాక్‌ (బి) ప్యాటిన్సన్‌ 9; దినేశ్‌ కార్తీక్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) రాహుల్‌ చహర్‌ 30; నితీశ్‌ రాణా (సి) హార్దిక్‌ (బి) పొలార్డ్‌ 24; మోర్గాన్‌ (సి) డికాక్‌ (బి) బుమ్రా 16; రసెల్‌ (బి) బుమ్రా 11; నిఖిల్‌ నాయక్‌ (సి) హార్దిక్‌ (బి) బౌల్ట్‌ 1; కమిన్స్‌ (సి) హార్దిక్‌ (బి) ప్యాటిన్సన్‌ 33; శివమ్‌ మావి (స్టంప్డ్‌) డికాక్‌ (బి) రాహుల్‌ చహర్‌ 9; కుల్దీప్‌ యాదవ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 146.

వికెట్ల పతనం: 1–14, 2–25, 3–71, 4–77, 5–100, 6–101, 7–103, 8–141, 9–146.

బౌలింగ్‌: బౌల్ట్‌ 4–1–30–2, ప్యాటిన్సన్‌ 4–0–25–2, బుమ్రా 4–0– 32–2, రాహుల్‌ చహర్‌ 4–0–26– 2, పొలార్డ్‌ 3–0–21–1, కృనాల్‌ 1–0–10–0.  

► ఐపీఎల్‌ టోర్నీ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై రోహిత్‌  ఇప్పటివరకు 904 పరుగులు చేశాడు. డేవిడ్‌ వార్నర్‌ (829–కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పైనే) పేరిట ఉన్న రికార్డును రోహిత్‌ సవరించాడు.   

►ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో ఎనిమిదేళ్ల తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది.

►తన టి20 కెరీర్‌లో బౌలర్‌ బుమ్రా ఒకే ఓవర్లో నాలుగు సిక్స్‌లు  సమర్పించుకోవడం ఇదే తొలిసారి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement