ఐపీఎల్-2024కు ముందే రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ముంబై ఇండియన్స్. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన హిట్‌మ్యాన్‌ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించి తగిన మూల్యం చెల్లించింది.
పాండ్యా సారథ్యంలో ఘోరంగా విఫలమైన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అడుగున నిలిచింది. రోహిత్- పాండ్యా సైతం ఎడమొహం- పెడమొహంగానే మెదిలారు. ఫలితంగా ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే, టీ20 ప్రపంచకప్-2024తో సీన్ రివర్స్ అయింది. ఈ ఇద్దరూ టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి నీరాజనాలు అందుకుంటున్నారు. కెప్టెన్‌గా రోహిత్, ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా తమ బాధ్యతను చక్కగా పూర్తి చేసి ప్రశంసలు దక్కించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం.. ట్రోఫీ గెలిచిన టీమిండియాలో సభ్యులైన తమ ఆటగాళ్లను ఘనంగా సత్కరించింది. ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు ఈ సందర్భంగా భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.
కాగా అంబానీ చిన్న కుమారుడు అనంత్- రాధికా మర్చంట్‌ల ముందస్తు పెళ్లి వేడుకలు ఆర్భాటంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగీత్ నిర్వహించిన సమయంలోనే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను ఉద్దేశించి నీతా అంబానీ మాట్లాడారు.
వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించి ఆత్మీయంగా హత్తుకుని భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ అద్భుతం చేశాడంటూ అతడిని హగ్ చేసుకున్న నీతా.. ఆ తర్వాత సూర్య, హార్దిక్‌లను కూడా ఆత్మీయంగా హత్తుకున్నారు.
ఈ సందర్భంగా హార్దిక్‌ను ఉద్దేశించి.. ‘‘కష్ట సమయం ఎప్పుడూ ఉండదు.. అయితే, పట్టుదల కలిగిన మనుషులు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటారు’’ అని ప్రశంసించారు. ముఖ్యంగా వరల్డ్‌కప్ ఫైనల్లో ఆఖరి ఓవర్ అద్భుతంగా వేసి జట్టును గెలిపించిన తీరు అమోఘమంటూ కొనియాడారు.
మరోవైపు.. 2011 నాటి సంబరాన్ని మళ్లీ తీసుకువచ్చారంటూ ముఖేశ్ అంబానీ ఆటగాళ్లను కితాబులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఇందులో రోహిత్ శర్మ మాత్రం పైకి నవ్వుతూ కనిపించినా కాస్త మనస్ఫూర్తిగా ఆ వేడుకలో భాగం కాలేకపోయాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే తన మనసు విరిగిపోయిందని.. వచ్చే సీజన్‌లో అతడు ముంబై ఇండియన్స్ జట్టును వీడటం పక్కా అని ఫిక్సయిపోయారు. కాగా వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో ఫైనల్లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో టీమిండియా ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
చివరి ఓవర్లో మూడు వికెట్లు తీసి హార్దిక్ పాండ్యా జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా భారత్ ఖాతాలో నాలుగో వరల్డ్‌కప్ టైటిల్ చేరింది.
AMBANI FAMILY celebrating the World Cup heroes - Captain Rohit, Hardik & Surya. 🇮🇳
- VIDEO OF THE DAY...!!!! ❤️ pic.twitter.com/8XbPo9kkLE— Johns. (@CricCrazyJohns) July 6, 2024
Comments
Please login to add a commentAdd a comment