ముంబై మెరుపులు  | Mumbai Indians crush Gujarat Giants in WPL opener | Sakshi
Sakshi News home page

ముంబై మెరుపులు 

Published Sun, Mar 5 2023 2:22 AM | Last Updated on Sun, Mar 5 2023 3:22 AM

Mumbai Indians crush Gujarat Giants in WPL opener - Sakshi

అప్పుడెలాగో... ఇప్పుడు అలాగే.... పురుషుల ఆటలోని మెరుపులు  అమ్మాయిల లీగ్‌లోనూ కనిపించాయి. 2008లో పురుషుల లీగ్‌ ధనాధన్‌గా ప్రారంభమైన రీతిలో మహిళల లీగ్‌ డబ్ల్యూపీఎల్‌కు కూడా తెర లేచింది. కోల్‌కతాలాగే ముంబై చెలరేగగా... భారీ లక్ష్య ఛేదనలో నాడు బెంగళూరు కుదేలైనట్లే... తాజాగా గుజరాత్‌ కూడా విలవిల్లాడింది. మొత్తానికి ఈ రెండు లీగ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు (కోల్‌కతా, ముంబై) 200 పైచిలుకు స్కోరుతో తొలి సీజన్‌కు అదిరిపోయే ఆరంభం ఇచ్చాయి. అంతకు ముందు తారాలోకంతో కూడిన ‘గానాబజానా’ వేడుకలు అందర్నీ ఆకట్టుకున్నాయి. 

ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ చరిత్ర ముంబై ఇండియన్స్‌ బోణీతో మొదలైంది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై 143 పరుగుల తేడాతో బెత్‌ మూనీ సారథ్యంలోని గుజరాత్‌ జెయింట్స్‌ను చిత్తు చేసింది. మొదట  ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. హేలీ మాథ్యూస్‌ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), అమెలియా కెర్‌ (24 బంతుల్లో 45 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా మెరిపించారు. అనంతరం గుజరాత్‌ జెయింట్స్‌ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌటైంది. హేమలత (29 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా, సయిక ఇశ్వక్ 4 వికెట్లు తీసింది.  

చెలరేగిన హేలీ, హర్మన్‌ 
హేలీ మాథ్యూస్‌తో ముంబై ఇన్నింగ్స్‌ ఆరంభించిన యస్తిక భాటియా (1) నిరాశ పరిచింది. అయితే నట్‌ సీవర్‌ బ్రంట్‌ (18 బంతుల్లో 23; 5 ఫోర్లు), హేలీ ధాటిగా ఆడటంతో వేగం పెరిగింది. హేలీ అయితే భారీ సిక్సర్లతో అలరించింది. 7.2 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరగా... కాసేపటికి వరుస ఓవర్లలో బ్రంట్, హేలీ నిష్క్రమించారు. 10 ఓవర్లలో ముంబై స్కోరు 77/3. తర్వాత సగం ఓవర్ల ఆట రూటు మారింది. అమెలియా కెర్‌ అండతో కెపె్టన్‌ హర్మన్‌ ఒక్కసారిగా బౌండరీలతో విరుచుకుపడింది.

కాసేపు ఇద్దరి ఆట పురుషుల లీగ్‌ను గుర్తుకుతెచ్చింది. మోనిక పటేల్‌ 15వ ఓవర్లో తొలి రెండు బంతులాడిన అమెలియా ఒక ఫోర్‌ కొడితే... తర్వాతి నాలుగు బంతుల్ని హర్మన్‌ బౌండరీలకు తరలించింది. ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 16వ ఓవర్లోనూ ‘హ్యాట్రిక్‌’ ఫోర్లు కొట్టిన హర్మన్‌ప్రీత్‌ 22 బంతుల్లో (11 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. హర్మన్‌–కెర్‌ జోడీ నాలుగో వికెట్‌కు కేవలం 7 ఓవర్లలోనే 89 పరుగులు జోడించారు.

హర్మన్‌ నిష్క్రమించాక... అమెలియా, పూజ (8 బంతుల్లో 15; 3 ఫోర్లు) ధాటిని కొనసాగించడంతో జట్టు స్కోరు 200 దాటింది. గుజరాత్‌ ఆట పేలవంగా మొదలై... చివరకు చిత్తుగా ఓడింది. టాపార్డర్‌లో మూనీ (0 రిటైర్డ్‌హర్ట్‌) గాయంతో వెనుదిరగ్గా... హర్లీన్‌ (0), సహా గార్డ్‌నర్‌ (0), తనూజ (0) ఖాతానే తెరువలేదు. ఏకంగా 9 మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. హేమలతతో పాటు మోనిక (10) రెండంకెల స్కోర్లు చేశారు.
 
స్కోరు వివరాలు 
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: యస్తిక (సి) జార్జియా (బి) తనూజ 1; హేలీ (బి) గార్డ్‌నెర్‌ 47; సీవర్‌ (సి) స్నేహ్‌ రాణా (బి) జార్జియా 23; హర్మన్‌ప్రీత్‌ (సి) హేమలత (బి) స్నేహ్‌ రాణా 65; అమెలియా నాటౌట్‌ 45; పూజ (సి) మోనిక (బి) స్నేహ్‌ రాణా 15; ఇసి వాంగ్‌ నాటౌట్‌ 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 207. వికెట్ల  పతనం: 1–15, 2–69, 3–77, 4–166, 5–201. 
బౌలింగ్‌: ఆష్లే గార్డ్‌నెర్‌ 4–0–38–1, మాన్సి 2–0–17–0, తనూజ 2–0–12–1, మోనిక 2–0–34–0, జార్జియా 3–0–30–1, అనాబెల్‌ 3–0–32–0, స్నేహ్‌ రాణా 4–0–43–2,
గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మేఘన (బి) సీవర్‌ 2; బెత్‌ మూనీ రిటైర్డ్‌ హర్ట్‌ 0; హర్లిన్‌ (సి) వాంగ్‌ (బి) నట్‌ సీవర్‌ 0; ఆష్లే గార్డ్‌నెర్‌ (సి) హేలీ (బి) వాంగ్‌ 0; అనాబెల్‌ (బి) ఇష్వాక్‌ 6; హేమలత నాటౌట్‌ 29; జార్జియా (బి) ఇషా్వక్‌ 8; స్నేహ్‌ రాణా (ఎల్బీ) (బి) అమెలియా 1; తనూజ (సి) నట్‌ సీవర్‌ (బి) అమెలియా 0; మాన్సి జోషి (ఎల్బీ) (బి) ఇష్వాక్‌ 6; మోనిక (బి) ఇష్వాక్‌ 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (15.1 ఓవర్లలో ఆలౌట్‌) 64. వికెట్ల పతనం: 1–1, 2–3, 3–5, 4–12, 5–22, 6–23, 7–23, 8–49, 9–64.
బౌలింగ్‌: నట్‌ సీవర్‌ 2–0–5–2, ఇసి వాంగ్‌ 3–0–7–1, సయిక ఇషా్వక్‌ 3.1–1–11–4, అమెలియా కెర్‌ 2–1–12–2, పూజ 2–0–9–0, కలిత 2–0–12–0, హేలీ 1–0–8–0.  

డాటిన్‌ వివాదం 
డబ్ల్యూపీఎల్‌ తొలి మ్యాచ్‌కు ముందే ఒక అనూహ్య పరిణామం వివాదాన్ని రేపింది. గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు తమ ప్రధాన ప్లేయర్‌ డియాండ్రా డాటిన్‌ (వెస్టిండీస్‌) గాయపడిందని ప్రకటించింది. ఆమె స్థానంలో ఆ్రస్టేలియా ఆల్‌రౌండర్‌ కిమ్‌ గార్త్‌ను తీసుకుంటున్నట్లుగా కూడా ప్రకటించింది. అయితే డాటిన్‌నుంచి భిన్నమైన స్పందన వచి్చంది. తాను అసలు గాయంతోనే లేదని ఆమె ప్రకటించడం విశేషం.

‘నేను కోలుకుంటున్నానని చెబుతున్నాను. అసలు ఏదైనా అయితే కదా నేను కోలుకునేది. దేనినుంచి కోలుకుంటున్నానో నాకే తెలీదు. నిజాలు చెబితే బాగుంటుంది’ అని ట్వీట్‌ చేసింది. దీనిపై గుజరాత్‌ యాజమాన్యం ఎలాంటి స్పష్టతనివ్వలేదు. వేలంలో డాటిన్‌ను గుజరాత్‌ రూ. 60 లక్షలకు తీసుకుంది. మహిళల టి20ల్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు ఉన్న డాటిన్‌ విండీస్‌ తరఫున 127 టి20లు ఆడింది. మహిళల టి20ల్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందింది.   


డబ్ల్యూపీఎల్‌లో నేడు
బెంగళూరు VS  ఢిల్లీ   మ.గం. 3.30 నుంచి 

యూపీ VS  గుజరాత్‌  రా.గం. 7.30 నుంచి 

స్పోర్ట్స్‌ 18 చానెల్‌లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement