‘శత’క్కొట్టిన తనుష్, తుషార్‌  | Ranji Trophy 2024 Highlights: Mumbai Reach Ranji Trophy Semi-Finals, Check Details Inside - Sakshi
Sakshi News home page

Ranji Trophy Baroda Vs Mumbai: ‘శత’క్కొట్టిన తనుష్, తుషార్‌ 

Published Wed, Feb 28 2024 4:20 AM | Last Updated on Wed, Feb 28 2024 10:17 AM

Mumbai in Ranji Trophy semis - Sakshi

పదో వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యం

రంజీ ట్రోఫీ సెమీస్‌లో ముంబై  

ముంబై: బరోడా, ముంబై జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్లో అద్భుతం చోటు చేసుకుంది. ముంబై జట్టుకు చెందిన చివరి వరుస బ్యాటర్లు తనుష్‌ కొటియన్‌ (129 బంతుల్లో 120 నాటౌట్‌; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), తుషార్‌ దేశ్‌పాండే (129 బంతుల్లో 123; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు)  శతకాలతో అదరగొట్టారు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో (మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు జరిగే మ్యాచ్‌లు) ఒకే ఇన్నింగ్స్‌లో పదో నంబర్,  పదకొండో నంబర్‌ బ్యాటర్లిద్దరూ సెంచరీలు చేయడం కేవలం ఇది రెండోసారికాగా, రంజీ ట్రోఫీలో మాత్రం తొలిసారి.

1946లో ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా సర్రే కౌంటీ జట్టుతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత జట్టు తరఫున పదో నంబర్‌ ప్లేయర్‌ చందూ సర్వాతే  (124 నాటౌట్‌), పదకొండో నంబర్‌ ప్లేయర్‌  శుతె బెనర్జీ (121) సెంచరీలు చేశారు. 

బరోడాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఓవర్‌నైట్‌ స్కోరు 379/9తో ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై 132 ఓవర్లలో 569 పరుగులకు ఆలౌటైంది. తనుష్, తుషార్‌ సెంచరీలు చేయడంతోపాటు పదో వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఒక పరుగు తేడాతో రంజీ రికార్డును సమం చేసే అవకాశం కోల్పోయారు. 1992 రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అజయ్‌ శర్మ–మణీందర్‌ సింగ్‌ పదో వికెట్‌కు 233 పరుగులు జత చేశారు.

ముంబై నిర్దేశించిన 606 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో టీ సెషన్‌ తర్వాత రెండు జట్ల కెపె్టన్‌లు ‘డ్రా’కు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ముంబై జట్టు సెమీఫైనల్‌ చేరుకుంది. 

విదర్భ విజయం 
నాగ్‌పూర్‌లో కర్ణాటకతో జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్లో విదర్భ 127 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. విదర్భ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 62.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లు హర్‌‡్ష దూబే (4/65), ఆదిత్య సర్వాతే (4/78) కర్ణాటకను దెబ్బ తీశారు. మార్చి 2 నుంచి జరిగే సెమీఫైనల్స్‌లో మధ్యప్రదేశ్‌తో విదర్భ; తమిళనాడుతో ముంబై తలపడతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement