ముంబై: భారత క్రికెట్ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యంకాని రీతిలో 500వ రంజీ మ్యాచ్ ను ఆడిన ముంబై ఎట్టకేలకు డ్రాతో గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది. గ్రూప్-సిలో భాగంగా బరోడాతో జరిగిన మ్యాచ్ లో ఆద్యంతం పేలవ ప్రదర్శన చేసిన ముంబై జట్టును ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సిద్దేశ్ లడ్డా ఆదుకున్నాడు. దాదాపు ఐదు గంటల పాటు క్రీజ్ లో నిలబడ్డ సిద్దేశ్ లడ్డా..238 బంతుల్ని ఎదుర్కొని 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి రోజు ఆటలో సిద్దేశ్ చలవతో ఏడు వికెట్లు మాత్రమే కోల్పోయి 260 పరుగులు చేసిన ముంబై డ్రాతో సరిపెట్టుకుంది. వాంఖేడ్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ ను డ్రా చేసుకున్న ముంబై పరువు నిలుపుకుంది.
ఓటమి దిశగా పయనించి చివరకు మ్యాచ్ ను డ్రా చేసుకోవడంలో సఫలం కావడంతో ముంబై శిబిరంలో పండుగ వాతావరణం నెలకొంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 171 పరుగులకే కుప్పకూలగా.. బరోడా 575/9 పరుగుల భారీ స్కోరు సాధించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వాఘ్ మోడ్ (138), స్వప్నిల్ సింగ్ (164) శతకాలతో జట్టుకు భారీ స్కోరు అందించారు. ఆపై రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ముంబై తడబాటుకు గురైంది. 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఓటమి ప్రమాదంలో పడింది. ఆ తరుణంలో సిద్దేశ్ లడ్డాకు జతగా రహానే(45; 134 బంతుల్లో 4 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్(44;132 బంతుల్లో 4 ఫోర్లు) పోరాడి మ్యాచ్ డ్రా కావడంలో సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment