న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని ముంబై జట్టు నాలుగోసారి ఎగురేసుకుపోయింది. ముంబై కెప్టెన్ పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌కు, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ ఆదిత్య తారే (107 బంతుల్లో 118 నాటౌట్; 18 ఫోర్లు) అద్భుత శతకం తోడవ్వడంతో పాటు శివం దూబే(42 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడటంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్ జట్టు.. ఓపెనర్ మాధవ్ కౌశిక్ (156 బంతుల్లో 158 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది.
కౌశిక్ శతకానికి మరో ఓపెనర్ సమర్థ్ సింగ్ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అక్షదీప్‌నాథ్ (40 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలు తోడవ్వడంతో యూపీ జట్టు ముంబైకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ముంబై బౌలర్లలో యశ్ దయాల్, శివమ్ మావి, శివమ్ శర్మ, సమీర్ చౌదరీలు తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం ఛేదనలో పృథ్వీ షా (39 బంతుల్లో 73 పరుగులు), ఆదిత్య తారే (107 బంతుల్లో 118 నాటౌట్; 18 ఫోర్లు) అద్భుతంగా రాణించడంతో ముంబై జట్టు భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ముంబై జట్టులో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 29; 3 ఫోర్లు, సిక్స్), షమ్స్ ములాని (43 బంతుల్లో 36; 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ శివమ్ దూబే దూకుడుగా ఆడడంతో ముంబై 41.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. యూపీ బౌలర్లు తనుశ్ కోటియన్ 2, ప్రశాంత్ సోలంకీ ఒక వికెట్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment