కొలంబో: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్పికర్ రహీమ్ మంగళవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. రహీమ్ సెంచరీతో 246 పరుగులు సాధించిన బంగ్లా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో లంకపై 103 పరగులుతో గెలిచి మరో వన్డే మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన రహీమ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో రహీమ్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విషయంలోకి వెళితే.. కెప్టెన్ కుషాల్ పెరీరా వికెట్ కోల్పోయాకా క్రీజులోకి వచ్చిన నిసాంకతో కలిసి మరో ఓపెనర్ గుణతిలక ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. మెహదీ హసన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ చివరి బంతిని నిసాంకా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే నిసాంకా బ్యాట్‌కు తగిలిన బంతి హసన్‌వైపు వెళ్లింది. అయితే హసన్ బంతిని వదిలేసాడని భావించి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అయితే గుణతిలక బంతిని డిఫెండ్ చేసే క్రమంలో హసన్‌కు అడ్డు వచ్చాడు. ఇది చూసిన రహీమ్.. ''ఈసారి అడ్డు వస్తే అతన్ని తోసేసి కింద పడేయ్'' అంటూ గట్టిగా అరిచాడు. ఇది స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. దీనికి సంబంధించిన ఒక వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రహీమ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడంతో ఈ విషయం పెద్దగా వెలుగులోకి రాలేదు. కాగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే మే 28న జరగనుంది.
ఇక ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో బంగ్లాదేశ్ అగ్రస్థానానికి చేరుకుంది. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుని పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక 2023 వరల్డ్ కప్‌నకు అర్హత సాధించే క్రమంలో ఇప్పటివరకు మొత్తంగా 8 వన్డేలు ఆడిన బంగ్లాదేశ్... ఐదింటిలో గెలుపొంది 50 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. కాగా ఆడిన 9 మ్యాచ్‌లలో నాలుగింటిలో గెలుపొందిన ఇంగ్లండ్ 40 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా... రన్‌రేట్‌లో వెనుకబడిన పాకిస్తాన్ 40 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉంది.
చదవండి: ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నా.. రేపు వీల్‌చైర్‌లో ఉంటానేమో
Comments
Please login to add a commentAdd a comment