బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు! | Najmul Hossain Shanto Record Most Test Wins-Bangladesh Captain | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు!

May 20 2026 8:02 PM | Updated on May 20 2026 8:23 PM

Najmul Hossain Shanto Record Most Test Wins-Bangladesh Captain

పాకిస్తాన్‌ను తమ సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి బంగ్లాదేశ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ హొసెన్‌ షాంటో కూడా ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్‌పై గెలుపుతో బంగ్లాదేశ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా నజ్ముల్‌ షాంటో రికార్డులకెక్కాడు. 

షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్‌ 18 టెస్టు మ్యాచ్‌లు ఆడితే అందులో 8 విజయాలు, 9 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. షాంటో కంటే ముందు ముష్ఫికర్‌ రహీమ్‌ కెప్టెన్సీలో బంగ్లా సాధించిన ఏడు టెస్టు విజయాలే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. తాజాగా షాంటో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. 

ఇక ముష్ఫికర్‌ రహీమ్‌ సారథ్యంలో బంగ్లాదేశ్‌ 34 టెస్టులు ఆడింది. ఇందులో 7 విజయాలు, 18 ఓటములు, 9 డ్రాలు ఉన్నాయి. స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ నేతృత్వంలో 19 టెస్టులు ఆడిన బంగ్లా 4 విజయాలు, 15 ఓటములు చవిచూసింది. మోమినుల్‌ హక్‌ సారథ్యంలో 17 మ్యాచ్‌లాడిన బంగ్లాదేశ్‌ మూడు విజయాలు సాధించి, 12 ఓటములు, రెండు డ్రాలు చేసుకుంది. 

ఈ లెక్కన నజ్ముల్‌ హసన్‌ షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్‌ టెస్టుల్లో ఎక్కువ విజయాలు సాధించడంతో అతడి కెప్టెన్సీ విన్నింగ్ శాతం అందరికంటే అధికంగా ఉంది. మ్యాచ్‌ విషయానికొస్తే సిల్హెట్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 78 పరుగుల తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్‌ 2-0తో సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.

437 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 316-7 స్కోర్‌ వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన పాక్‌.. కొద్దిసేపటిలోనే మిగిలిన 3 వికెట్లు కోల్పోయి 358 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (94) పాక్‌ను గట్టెక్కించే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అతని పోరాటం వృధా అయ్యింది. తైజుల్‌ ఇస్లాం (34.2-4-120-6) అద్భుత ప్రదర్శనలతో పాక్‌ పతనాన్ని శాసించాడు.

చదవండి: పాక్ మాజీ క్రికెట‌ర్‌కు బంప‌రాఫ‌ర్‌.. ఐపీఎల్‌కు అర్హత!

Advertisement
 
Advertisement
Advertisement