సూర్యకుమార్ యాదవ్- తిలక్ వర్మ (ఫైల్ ఫొటో)
Tilak VarmaTraining Video: టీమిండియా యువ బ్యాటర్, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగా జిమ్‌లో చెమటోడుస్తూ ఫిట్‌నెస్ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తన వర్కౌట్లకు సంబంధించిన వీడియోను తిలక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
‘‘కొత్త ఏడాది చేసుకున్న తీర్మానాలకు కట్టుబడి ఉంటాను. 2024ను ఆరంభించడానికి ఇంతకంటే గొప్ప మార్గం ఇంకొకటి లేదు’’ అని తిలక్ వర్మ సదరు వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఇందుకు బదులుగా టీమిండియా వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ‘‘నీకు ఇలాంటి నకిలీ క్యాప్షన్లు ఎవరు ఇస్తారు’’ అంటూ సరదాగా ట్రోల్ చేశాడు.
క్యాప్షన్, వీడియో రెండూ నకిలీవే
మరో టీమిండియా స్టార్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కూడా సూర్యకు వత్తాసు పలుకుతూ.. ‘‘క్యాప్షన్ ఒక్కటే కాదు.. ఆ వీడియో కూడా నకిలీదే. డిసెంబరు 30నాటి ట్రెయినింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియో అది’’ అంటూ తిలక్ వర్మను ఆటపట్టించాడు. తిలక్‌ను ఉద్దేశించి సూర్య, అక్షర్ చేసిన కామెంట్లు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా
కాగా అండర్-19 వరల్డ్‌కప్‌లో సత్తా చాటి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్-2022, 2023 సీజన్లలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుని.. టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ లెఫ్టాండర్.. ఇటీవల దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లోనూ ఆడాడు.
అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తంగా 15 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్ వర్మ.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 310, 68 పరుగులు సాధించాడు. అదే విధంగా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ పార్ట్‌టైమ్ స్పిన్నర్. తదుపరి జనవరి 11 నుంచి మొదలుకానున్న అఫ్గనిస్తాన్ సిరీస్‌లో తనను తాను నిరూపించుకుని టీ20 ప్రపంచకప్ జట్టులో చోటే లక్ష్యంగా తిలక్ వర్మ ముందుకుసాగుతున్నాడు.
చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment