‘జఫ్పా’తో మాయచేసిన సైనీ.. గిల్‌ బౌల్డ్‌!.. స్కోరెంతంటే? | Navdeep Saini Jaffa Stuns Shubman Gill Pant Brilliant Grab Dismisses Mayank | Sakshi
Sakshi News home page

నవదీప్‌ సైనీ ‘జఫ్పా’.. గిల్‌ బౌల్డ్‌!.. పంత్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అతడు అవుట్‌

Published Fri, Sep 6 2024 7:46 PM | Last Updated on Fri, Sep 6 2024 8:32 PM

Navdeep Saini Jaffa Stuns Shubman Gill Pant Brilliant Grab Dismisses Mayank

గిల్‌ బౌల్డ్‌- మయాంక్‌ క్యాప్‌ పట్టిన పంత్‌ (PC: BCCI X)

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ దులిప్‌ ట్రోఫీ-2024లో శుభారంభం అందుకోలేకపోయాడు. ఇండియా-‘ఏ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. ఇండియా- ‘బి’తో మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయాడు.  కేవలం 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు.

నిరాశపరిచిన గిల్‌
క్రీజులో నిలదొక్కుకుని భారీ స్కోరు సాధిస్తాడనుకున్న అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. ఇండియా-‘బి’ పేసర్‌ నవదీప్‌ సైనీ సంధించిన ‘జఫ్ఫా(పర్ఫెక్ట్‌ బాల్‌)’ ధాటికి బౌల్డ్‌ అయ్యాడు. దులిప్‌ ట్రోఫీ తొలి రౌండ్‌లో భాగంగా ఇండియా-ఏ, ఇండియా-బి జట్ల మధ్య గురువారం తొలి మ్యాచ్‌ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టాస్‌ గెలిచిన శుబ్‌మన్‌ గిల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

ముషీర్‌ ఖాన్‌ శతకం కారణంగా ఇండియా-బి మెరుగైన స్కోరు
ఈ క్రమంలో ఇండియా-బి తరఫున అరంగేట్ర బ్యాటర్‌ ముషీర్‌ ఖాన్‌ అద్భుత శతకం(181)తో ఆకట్టుకోగా.. పేసర్‌ నవదీప్‌ సైనీ సైతం సంచలన ఇన్నింగ్స్‌(56) ఆడాడు. వీరిద్దరు రాణించిన కారణంగా 321 పరుగుల వద్ద రెండోరోజు ఇండియా-బి తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టుకు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ శుభారంభం అందించాడు.

సైనీ జఫ్ఫా.. గిల్‌ బౌల్డ్‌
ఈ కర్ణాటక బ్యాటర్‌ 45 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 36 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. నఅయితే, మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ 43 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సాయంతో 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో నవదీస్‌ సైనీ అవుట్‌సైడ్‌ ఆఫ్‌ దిశగా వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఫలితంగా బంతి స్టంప్‌ను ఎగురగొట్టడంతో గిల్‌ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.

వీడియో వైరల్‌
అనంతరం నవదీప్‌ సైనీ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో మయాంక్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో రెండో రోజు ఆటలో ఇండియా-ఏ రెండో వికెట్‌ కోల్పోయింది. ఆట పూర్తయ్యే సరికి రియాన్‌ పరాగ్‌ 27, కేఎల్‌ రాహుల్‌ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా గిల్‌ అవుటైన దృశ్యాలకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. 

ఇదిలా ఉంటే.. ఇటీవలే టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన గిల్‌.. తదుపరి బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ ఆడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. దులిప్‌ ట్రోఫీ ప్రదర్శన ఆధారంగా భారత జట్టు ఎంపిక నేపథ్యంలో గిల్‌ తనను తాను మరోసారి నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 

చదవండి: బ్యాట్‌ ఝులిపించిన శ్రేయస్‌ అయ్యర్‌.. ఎట్టకేలకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement